ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధించాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆయనను సీఎం జగన్ ముప్పు తిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏబీవీని ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేయించిన జగన్…ఆ సస్పెన్షన్ రెండేళ్ల వరకు కొనసాగేలా చూశారు. ఆ తర్వాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరినా…పెడ చెవిన పెట్టారు. చివరకు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడంతో చేసేదేమీ లేక సస్పెన్షన్ ఎత్తివేశారు.
అయితే, ఏబీవీ చేతిలో తనకు గర్వభంగం కావడంతో జగన్ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. అక్కడ రిపోర్ట్ చేసినా పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ సర్కార్ మీన మేషాలు లెక్కించింది. అయితే, ఈ వ్యవహారంపై కూడా విమర్శలు రావడంతో ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఏబీవీకి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ వంటి అనామక పోస్టును కేటాయించి జగన్ మరోసారి తన మోనార్కిజాన్ని చాటుకున్నారని విమర్శలు వచ్చాయి.
అయితే, జగన్ శాడిజం అంతటితో ఆగలేదు. మరోసారి కుంటి సాకులు చెప్పి…పసలేని ఆరోపణలు చేసి ఏబీని పోస్టింగ్ ఇచ్చిన 15 రోజుల్లోపే సస్పెండ్ చేయించారు జగన్. అంటే, మిగిలి ఉన్న తన రెండేళ్ల హయాంలో ఏబీవీ పనిచేయకూడదని జగన్ ఫిక్సయ్యారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఏబీవీ గతంలో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు.
అదే సమయంలో ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలంటూ ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం….జగన్ కు షాకిచ్చింది. ఆ ప్రతిపాదనలను తిరస్కరించిన కేంద్రం…. ఏబీ వెంకటేశ్వరరావును ఉద్యోగం నుంచి తొలగించడం, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడం కుదరదని తేల్చి చెప్పింది.