ఆర్ఎస్ఎస్ స్టిక్కరుందని తిరుమలకి నో ఎంట్రీ

సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో పలు పరిణామాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం మొదలుకొని...టీటీడీ భూముల వేలంపాట, సప్తగిరి మాసపత్రికలో లవకుశ కథ వరకు పలు వివాదాలు టీటీడీని చుట్టుముట్టాయి. ఇక, ఎస్వీబీసీ మాజీ చైర్మన్ సినీ నటుడు పృథ్వీ ఆడియోటేపు వ్యవహారం పెను దుమారం రేపింది.

టీటీడీకి చెందిన 50 ఆస్తుల వేలం వ్యవహారం వివాదాస్పదం కావడంతో....టీటీడీ ఆస్తుల వేలంపై బోర్డు ఏకంగా నిషేధం విధించాల్సి వచ్చింది. దీంతోపాటు, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. దీంతో, ఏపీలో హిందువుల ఆలయాలు, వాటి ఆస్తుల వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యం చర్చనీయంశమయ్యాయి. ఇక, పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం, నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో రథం కాలిపోవడం, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనలు హిందువుల్లో అభద్రతా భావాన్ని ఏర్పరిచాయి.

ఈ వివాదాలు సద్దుమణగకముందే తిరుమలలో జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టే మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్, బీజేపీ స్టిక్కర్ ఉన్న ఓ భక్తుడి వాహనాన్ని తిరుమల కొండపైకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడం వివాదాస్పదమైంది.

తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ సంస్థల స్టిక్కర్లు ఉన్నా వాటిని పోలీసులు నిలిపివేయడం చర్చనీయాంశమైంది. తన వాహనానికి ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉందని, ఆ స్టిక్కర్ తీస్తేనే కొండపైకి అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారని ఓ భక్తుడు ఆవేదన చెందారు. అంతకుముందు బీజేపీ స్టిక్కర్ తీసేయమన్నారని, దానిని తీసి వేశానని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనేది హిందువా? క్రిష్టియనా? ముస్లిమా? అని ఆ భక్తుడు ప్రశ్నించారు.

హిందువుల ఆలయాల్లోకి హిందువులను అనుమతించకపోవడం దారుణమని, ఆర్ఎస్ఎస్ అంటే అంత ఉలుకెందుని ప్రశ్నించారు. తాము వేరే మతాన్ని ప్రచారం చేయడం లేదని, ఫక్తు హిందూ సంస్థనే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ఆ భక్తుడు ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీయొద్దని అన్నారు. మరి, ఈ ఘటనపై టీటీడీ,ప్రభుత్వం ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.