ఏపీలో సోలార్ ఒప్పందం కోసం మాజీ సీఎం జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా, అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం, అదానీ కేసుకు ఏపీతో లింకులు ఉండడం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోన జగన్ పై టీడీపీ నేత, ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి సంచలన విమర్శలు చేశారు. అవినీతిలో జగన్ ను మించినవారు లేరని అదానీ కేసుతో మరోసారి నిరూపితమైందని చురకలంటించారు. ఆ వ్యవహారంలో జగన్ కు 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆరోపించారు.
అమెరికాలో నమోదైన ఆ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదని, అందుకే జగన్ అమెరికా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విమర్శించారు. అమెరికా జైళ్లలో బ్రెడ్, జామ్ మాత్రమే ఇస్తారు కాబట్టి జగన్ ఇప్పటి నుంచే బ్రెడ్ తినడం అలవాటు చేసుకోవాలని సెటైర్లు వేశారు. వైఎస్ భారతమ్మ ఇంట్లో తయారు చేసిన చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ జైలుకు తీసుకెళ్లే అవకాశం లేదని చురకలంటించారు. కమీషన్లు ముట్టేసరికి అర్ధరాత్రి అదానీ సోలార్ ఒప్పందం ఫైళ్లు బాలినేని ఇంటికి వెళ్లాయని, అందులో తప్పు జరిగిందని భావించిన బాలినేని సైడ్ అయిపోయారని తెలిపారు.