వైసీపీలో నెల్లూరు నేతల తిరుగుబాటు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడంతో ఏపీలో రాజకీయం రక్తి కట్టింది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ వారిద్దరూ తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.
ఆ తర్వాత జరిగిన ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలలో వీరిద్దరూ క్రాస్ కటింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వారిద్దరిని సస్పెండ్ చేయడం షాకింగ్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి, ఆనంలు టిడిపి కండువా కప్పుకోబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోని తాజాగా టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో ఆనం భేటీ అయ్యారు. అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
రాబోయే ఎన్నికలలో ఆత్మకూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేసే విషయంపై చంద్రబాబుతో ఆనం చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఆనం కుమార్తె కైవల్యారెడ్డి కూడా యువనేత నారా లోకేశ్‌తో సమావేశమైన క్రమంలో.. ఇద్దరూ టీడీపీ నుంచి బరిలోకి దిగాలని కోరుకుంటున్న విషయాన్ని కూడా చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే, ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. దీంతో, కైవల్యారెడ్డి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది
ఆనం, చంద్రబాబుల మధ్య దాదాపు 40 నిమిషాలు పాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.