ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్యూజ్డ్(ఏ)-6.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కొన్ని కీలక షరతులు కూడా విధించింది. అయితే.. వివేకా దారుణ హత్యలో ఉదయ్ కుమార్‌రెడ్డి కీలకమని.. అన్నీ ఆయనకు తెలుసునని.. పైగా హైప్రొఫైల్ నాయకులతో ఆయనకు పరిచయాలు కూడా ఉన్నాయని.. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వరాదని వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత హైకోర్టుకు విన్నవించారు.
అదేవిధంగా ఈ కేసును విచారిస్తున్న సీబీఐ కూడా.. ఉదయ్‌కు బెయిల్ ఇవ్వరాదని పేర్కొంది. దాదాపు నాలుగు మాసాలుగా జరుగుతున్న ఈ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. కొన్ని గంటల పాటు ఇరు పక్షాలు.. తమ వాదనలు వినిపించాయి. ముఖ్యంగా దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిళ్లను రద్దు చేయాలని కోరుతూ.. ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశామని సునీత తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయవద్దని సునీత సహా సీబీఐ కూడా విన్నవించారు.
ఇప్పటికి మూడు సార్లు తిరస్కరణ
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డికి వివేకా దారుణ హత్య కేసులో పాత్ర ఉందని ఆరోపిస్తూ.. సీబీఐ అధికారులు గత ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఇప్పటికి మూడు సార్లు కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది. అయితే.. తాజాగా జరిగిన విచారణ అనంతరం.. ఉదయ్‌కు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఇవీ.. షరతులు..
+ ఎవరినీ ప్రభావితం చేయకూడదు. బెదిరించకూడదు.
+ వివేకా కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్కరితోనూ మాట్లాడకూడదు. చాటింగ్కూడా చేయరాదు.
+ ప్రతి వారం పులివెందుల పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి.
+ ఘటనపై మీడియాతో మాట్లాడొద్దు.
+ పాస్ పోర్టు ను స్థానిక పోలీసులకు అందించాలి.