సంక్రాంతి సంబరాల్లో కోడి పందేలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా జనాలు వస్తుంటారు. ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జోరుగా కోడి పందేలను నిర్వహించారు. ఈసారి పందెం కోళ్లతో పాటు వేల కోట్ల రూపాయిలు గాల్లోకి ఎగిరాయి. అయితే పౌరుషానికి పరాకాష్టగా ప్రాణాలకు తెగించి పోరాడే పందెం పుంజులు బతికినా, చచ్చినా వాటి ఖరీదు వేలల్లో ఉంటుంది.
తాజాగా ఓ చచ్చిన పందెం కోడి పుంజు ఏకంగా రూ. లక్ష పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. సాధారణంగా బరిలో చనిపోయిన పందెం పుంజులకు యమా డిమాండ్ ఉంటుంది. అత్యంత రుచికరంగా ఉండటం వల్ల పందెం కోడి మాంసం తినాలని కొందరు తెగ ఆరాటపడుతుంటారు. అందుకు తగ్గట్లే కోడి పుంజు మాంసం ఖరీదు కేజీ రూ. వెయ్యి నుంచి 2 వేల వరకు ఉంటుంది. కానీ చనిపోయిన కోడి కోసం ఓ వ్యక్తి రూ. లక్ష వెచ్చించి అరుదైన రికార్డు సృష్టించాడు.
ఏలూరుకు చెందిన రాజవంశీ, రాజేంద్ర, ఆహ్లాద్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం ఈ కోడిని పందెం వేయగా.. బరిలో తుది వరకు పోరాడి ఓడింది. అయితే కోడి చచ్చినా దాని పోరాట పటిమ పలువురిని ఎంతగానో ఆకర్షించింది. చనిపోయిన ఆ కోడిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. దాంతో కోడి పుంజును కాల్చి వేలం వేయగా.. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ అనే వ్యక్తి అక్షరాల రూ. 1,11,111 కు సోంతం చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.