ప్రముఖ మీడియా సంస్థ మీద విమర్శలు.. ఆరోపణలు ఉంటాయి కానీ.. ఆర్థిక నేరాల కేసులు తక్కువగా కనిపిస్తాయి. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పరిచయం ఉన్న మీడియా సంస్థగా దక్కన్ క్రానికల్ నిలుస్తుంది. అలాంటి ఈ సంస్థ మీద ఐదేళ్ల క్రితం భారీ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. అనంతరం విచారించిన ఈడీ.. ఈ మోసానికి సంబందించిన అంశాల్ని వెలికితీస్తోంది.
ఈడీ అంచనా ప్రకారం దాదాపు రూ.8180 కోట్ల రుణ మోసానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. బెంగళూరులోని బ్యాంక్ సెక్యురిటీ.. ఫ్రాడ్ సెల్.. సీబీఐదాఖలు చేసిన ఆర్ ఎఫ్ఐఆర్ లు.. ఛార్జిషీట్ల ఆధారంగా చూస్తే.. భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఈ కేసులకు సంబంధించి గతంలో కొన్ని ఆస్తుల్ని జఫ్తు చేశారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తాజాగా రూ.122.15 కోట్ల స్థిరాస్తుల్ని ఈడీ తాత్కాలికంగా జఫ్తు చేసింది. ఈ ఆస్తుల్లో డెక్కన్ క్రానికల్ తో పాటు.. దాని ప్రమోటర్లు ఏర్పాటు చేసిన బినామీ కంపెనీకి చెందిన ఆస్తులు ఉన్నట్లుగా ఈడీ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. దీంతో.. ఇప్పటివరకు రూ.264.56 కోట్లను జఫ్తు చేశారు. ఈడీ చెబుతున్న దాని ప్రకారం జరిగిన మోసానికి.. ఇప్పటివరకు జప్తు చేసిన మొత్తానికి మధ్య అంతరం భారీగా ఉండటం గమనార్హం. మరీ.. మోసం ఒక కొలిక్కి రావటానికి.. లెక్క తేలటానికి మరెంత కాలం పడుతుందో చూడాలి.