జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారిని మద్యం షాపుల దగ్గర జనాలను క్యూలో నిలబెట్టేందుకు నియమించడం మొదలు…ఎవరో పెట్టిన పోస్ట్ ను షేర్ చేసిన పాపానికి ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడం వరకు…జగన్ తీసుకున్న అనేక అనాలోచిత నిర్ణయాలపై ఉపాధ్యాయులు గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా సీపీఎస్ రద్దుపై తీవ్ర అసహనంతో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు జగన్ పై పోరుకు రెడీ అయ్యారు.
ఇక, ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులపై హామీల జల్లు కురిపించిన జగన్…సీఎం అయిన తర్వాత వాటిని మరచిపోయారని విమర్శలు వస్తున్నాయి. జగన్ పాలనలో తాము కూడా అమ్మో ఒకటో తారీకు అనే రీతిలో జీతాల కోసం ప్రతినెలా 5 నుంచి 7వ తారీకు వరకు ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందని ఉద్యోగులు వాపోతున్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ రెండేళ్లయినా దాని ఊసే ఎత్తడం లేదని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి.
సీఎం అయిన వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్…117వారాలయినా రద్దు చేయలేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే
జగన్ పై వార్ కు ఉద్యోగులు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు నిరసన వారోత్సవాలు నిర్వహించి…8వ తేదీన ఎమ్మెల్యేలకు తమ సమస్యలపై వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ఆగస్టు 15న సీఎం జగన్, ప్రభుత్వ పెద్దలకు సామాజిక సందేశాలు పంపించనున్నారు. సెప్టెంబర్ 1న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ‘విద్రోహ దినం-నయవంచన సభలు’నిర్వహించనున్నారు.
సీపీఎస్ రద్దు అంశం రాష్ట్ర పరిధిలోదేనని కేంద్రం క్లారిటీ ఇచ్చినా జగన్ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ చంద్రారెడ్డి ఇటీవల ఓ కంటితుడుపు ప్రకటన చేశారు. సీపీఎస్ రద్దుకు జగన్ సానుకూలమని, సబ్‌కమిటీ వేశారని, త్వరలోనే పరిష్కరిస్తామంటూ తాత్కాలికంగా నిరసనలు రేగకుండా చూసుకున్నారు. కానీ, ఆ ప్రకటనలు..కంటితుడుపు కమిటీలతో లాభం లేదని ఉద్యోగులు నిరసన బాట పట్టారు.
తమిళనాడు లో సీపీఎస్ రద్దు చేస్తామంటూ నాటి ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎన్నికల హామీ ఇచ్చారు. సీఎం అయిన నెలలోపే సీపీఎస్ రద్దుపై సీఎం స్టాలిన్ కసరత్తు మొదలుపెట్టారు. త్వరలోనే సీపీఎస్ రద్దుకు వడివడగా స్టాలిన్ అడుగులు వేస్తుంటే…జగన్ మాత్రం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇక, డీఏ ఎరియర్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచినా…రాష్ట్రం మాత్రం 2019 జనవరి నుంచి ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. 2019 ఏడాదికి సంబంధించిన రెండు డీఏ బకాయిలను జూలై 2021, జనవరి 2022న చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
ఇక, తమ సమస్యలపై ఉపాధ్యాయులు కూడా పోరుబాటపడుతున్నారు. గిరిజన, మున్సిపల్ స్కూళ్లలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్ తో ఆగస్టు 4న ఐటీడీఎ, ఆగస్టు 6న మున్సిపల్ కేంద్రాల్లో ధర్నాలకు యుటిఎఫ్ పిలుపునిచ్చింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలల సంఖ్యను తగ్గిచేసి అంచెలంచెలుగా ప్రాథమిక పాఠశాలలకు జగన్ సర్కార్ ఎసరు పెడుతోందని విమర్శలు వస్తున్నాయి.
అయితే, జూలై నెలలో జీతాలనే పూర్తి స్థాయిలో ఇవ్వడానిని నానా తిప్పలు పడ్డ జగన్ సర్కార్…డీఏ చెల్లింపులకు నిధులెక్కడినుంచి తెస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక, ఆగస్టు నెలలోనూ జీతాల కోసం ఏపీ సర్కార్ తిప్పలు పడుతోందని తెలుస్తోంది. రెండో తారీకైనా ప్రభుత్వుద్యోగులకు జీతాలు పడలేదు. నిన్న ఆదివారం సెలవుదినం అని సాకు చెప్పేందుకూ వీల్లేదు. ఎందుకంటే, సెలవు దినాల్లోనూ జీత భత్యాలు చెల్లించుకోవచ్చని ఆగస్టు1 నుంచి ఆర్బీఐ ఆల్రెడీ ప్రకటించింది.
అసలే ఓ వైపు ఏపీలో అప్పు చేసి పప్పుకూడు పెడుతున్నారని, సంక్షేమ పథకాల పేరుతో ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిచ్చే పరిస్థితి లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రకటించిన 2 డీఏ బకాయిలు కాకుండా మరో 4 డీఏలు ఇవ్వాల్సి వస్తుందని, ఇపుడున్న పరిస్థితుల్లో వాటి సంగతి అగమ్యగోచరంగా మారిందని అనుకుంటున్నారు. డీఏ బకాయిల మొత్తం సుమారు రూ.12 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. రాష్ట్రానికి కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని ఈ సమయంలో బకాయిల చెల్లింపుపై ఫోకస్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు.
ఇక, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించబోతున్నారన్న వార్తలు ఉపాధ్యాయుల్లో కలకలం రేపాయి. మంగళగిరి, తాడేపల్లి నగర కార్పొరేషన్ అయిన తర్వాత అక్కడ హెచ్ఆర్ఏ 14.5 శాతం నుంచి 20శాతానికి పెరిగింది. అయితే, ఆ పెరుగుదలను ఉపాధ్యాయుల జీతాల్లో కలిపి ఇవ్వాలన్న కారణంతో వారికి దాదాపుగా 5 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు.
హెచ్ఆర్ ఏను జీతంలో కలిపేందుకు ఏదో సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి నెలల తరబడి జీతాలు చెల్లించకుంటే ఇల్లు గడవడమే కష్టంగా మారిందని, ఈఎంఐలు చెల్లించేందుకు ఏపీ సర్కార్ లాగే అప్పులు చేయాల్సి వస్తుందని ఆ ప్రాంతంలోని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఏపీలో 5 లక్షల ఉద్యోగస్తుల కుటుంబాలున్నాయని, వారంతా రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకుగా మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఏపీలోని ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను జగన్ సత్వరమే పరిష్కరించకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ విళ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.