ఊహించని విషాదం చోటు చేసుకుంది. భారీగా లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు గుర్తున్నారు కదా? అవినీతి ఆరోపణల కేసులో ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక భూ వివాదానికి సంబంధించి సెటిల్ చేసే క్రమంలో ఏకంగా రూ.1.10 కోట్ల లంచాన్ని డిమాండ్ చేయటం.. దానికి సంబంధించిన పక్కా సమాచారాన్ని అందుకున్న ఏసీబీ అధికారులు.. ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఒకేసారి రూ.1.10 కోట్ల భారీ మొత్తాన్ని అధికారులు పట్టుకోవటం అదే తొలిసారి.
ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అనంతరం ఆయన్ను అధికారులు విచారించారు. అయినప్పటికీ ఆయన నోటి నుంచి మాట రాలేదని చెబుతారు. ప్రస్తుతం చంచగూడ జైల్లో ఉన్న ఆయన.. ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది.
తాను తీసుకున్న రూ.1.10 కోట్ల లంచం మొత్తం తనకే కాదని.. చాలామందికి ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని విచారణ సందర్భంగా నాగరాజు చెప్పినట్లుగా చెబుతారు. అధికారికంగా దాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు. ఉప్పల్ లోని శ్రీ చౌలా శ్రీనాథ్ యాదవ్.. శ్రీ సత్య డెవలపర్ల నుంచి భూమిని వారు కోరినట్లుగా మార్పులు చేయటానికి రూ.2 కోట్లు డిమాండ్ చేయగా.. అందులో భాగంగా రూ.1.10 కోట్ల మొత్తాన్ని నాగరాజుకు లంచంగా ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్ ఐ.. డీటీ.. తహసీల్తార్ వరకు పని చేసిన ప్రతిచోట.. చేతివాటాన్ని చూపించే గుణం నాగరాజుకు ఎక్కువనే చెబుతారు. అలాంటి అవినీతి అధికారి.. చివరకు జైల్లో ఆత్మహత్య చేసుకోవట ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.