ప్రజాక్షేత్రంలో ఉన్న రాజకీయ నాయకులు అచితూచి మాట్లాడాలి. ఏదైనా స్టేట్ మెంట్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. అంతేగానీ, వైరి పార్టీపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే క్రమంలో సొంత పార్టీ నేతల బండారం బయటపెట్టకూడదు. ఒకవేళ అలా తమవారికే నష్టం వాటిల్లే ప్రకటనలు చేసి ఇంటి గుట్టురట్టు చేసుకుంటే మాత్రం ఆ నేతకు తిప్పలు తప్పవు. తాజాగా ఏపీ పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉండడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమపైనే దాడి చేయడం, అక్రమ కేసు బనాయించడం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం అధికార పార్టీకి డ్యామేజీ చేస్తుందని భావించిన కొడాలి నాని…తన మార్క్ ప్రెస్ మీట్ పెట్టి దేవినేని ఉమ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తనకు మాత్రమే సాధ్యమైన భాషలో విమర్శలు గుప్పించారు. అయితే, తన మాటలకు కొద్దిగా వెయిట్ తెచ్చే క్రమంలో కొడాలి నాని టంగ్ స్లిప్ అయ్యారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం లేదని, ఆయన ఏపీలోనే అతి పెద్ద స్పిన్నింగ్ మిల్ అయిన వసంత స్పిన్నర్స్ లిమిటెడ్ కు ఓనర్ అని కొడాలి నాని చెప్పేశారు. అయితే, ఆ మాటన్న తర్వాత గాని నానికి తాను నోరు జారానన్న సంగతి అర్థం కాలేదు. కానీ, ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే, 2019లో వసంత కృష్ణ ప్రసాద్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆ 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్పిన్నింగ్ మిల్ ఊసే లేదు.
దీంతో, వసంత కృష్ణ ప్రసాద్ ను కొడాలి నాని అడ్డంగా బుక్ చేసినట్లయింది. ఇప్పటిదాకా అతికొద్ది మందికే తెలిసిన తమ పార్టీ నేత గుట్టును నాని అందరికీ రట్టు చేసినట్లయింది. మరి, తాజాగా నాని వ్యాఖ్యల నేపథ్యంలో ఆ మిల్లు ఎండీని తానేనని వసంత ఒప్పుకోక తప్పని పరిస్థితి. మరోవైపు, ఎన్నికల అఫిడవిట్ లో ఆ మిల్లు విషయం చెప్పలేదు కాబట్టి న్యాయపరంగా ఎస్ఈసీ నుంచి ఏమైనా చిక్కులు ఎదురయ్యే అవకాశమూ లేకపోలేదు.
ఏది ఏమైనా, దేవినేని ఉమను కార్నర్ చేయబోయి…వసంత కృష్ణప్రసాద్ ను కొడాలి నాని సెంటర్ చేసిన వైనం ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి, ఈ డ్యామేజీని కంట్రోల్ చేసుకోవడానికి కొడాలి నాని, లేదంటే మరెవరైనా వైసీపీ నేతలు మరో ప్రెస్ మీట్ తో ముందుకు వస్తారా? లేక సైలెంట్ గా తేలు కుట్టిన దొంగల్లా ఉంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.