కరోనా వల్ల తలెత్తిన లాక్డౌన్ వల్ల ముందుగా మూతపడ్డ బిజినెస్ అంటే థియేటర్ ఇండస్ట్రీదే.. అదే సమయంలో లాక్ డౌన్ షరతులన్నీ ఎత్తేశాక కూడా థియేటర్లు తెరుచుకోవడం కష్టమే అవుతోంది. గత ఏడాది లాక్ డౌన్ షరతులు ఎత్తేసి మిగతా బిజినెస్లన్నీ ఓపెన్ అయిన కొన్ని నెలలకు, చివరగా థియేటర్లు మొదలు కావడం తెలిసిందే. అప్పుడు కూడా 50 శాతం ఆక్యుపెన్సీతోనే మొదలుపెట్టి.. కొన్ని నెలల తర్వాత పూర్తి ఆక్యుపెన్సీకి ఛాన్సిచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ టైంలోనే థియేటర్లకు గట్టి దెబ్బ తగిలింది. ఈ పరిణామాలతో థియేటర్ ఇండస్ట్రీ దారుణంగా దెబ్బ తింది. ఐతే దీని గురించి ఇండస్ట్రీ నుంచి బలంగా వాయిస్ వినిపించే వాళ్లు కరవయ్యారు. ఈ సమయంలో యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని థియేటర్ల కోసం బ్యాటింగ్ చేశాడు. సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘తిమ్మరసు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాని.. అక్కడ చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
ముందు ‘తిమ్మరసు’ గురించి, సత్యదేవ్ గురించి మాట్లాడి.. ఇది సందర్భమో కాదో అంటూ.. మధ్యలో థియేటర్ల గురించి ప్రస్తావించాడు నాని. థియేటర్లతో తెలుగు వారికి ఉన్న అనుబంధమే వేరని.. ఇంటి తర్వాత మనకు అంత ముఖ్యమైన ప్రదేశం థియేటరే అని నాని అన్నాడు. వేరే దేశాల్లో సెలవు దొరికితే, వీకెండ్ వస్తే తల్లిదండ్రులతో, స్నేహితులతో గడుపుతారని.. కానీ మనం ఆ తల్లిదండ్రులను, స్నేహితులను తీసుకుని థియేటర్లకు వెళ్తామని.. అలా మన జీవితాల్లో కీలకంగా మారిన థియేటర్లు కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాయన్నాడు. లాక్ డౌన్ టైంలో ముందుగా మూతపడి, చివరగా తెరుచుకునేవి థియేటర్లే అని నాని అన్నాడు.
రెస్టారెంట్లు, మాల్స్‌లో జనాలు మాస్కుల్లేకుండా తిరిగేస్తూ, సరదాగా గడుపుతున్నారని.. వాటితో పోలిస్తే థియేటర్లు సురక్షితమని.. అక్కడ ఎవరూ మాస్క్ తీయకుండా.. ఒకరితో ఒకరు మాట్లాడకుండా.. స్క్రీన్ వైపు చూస్తారని.. సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తారని నాని వివరించాడు. తాను థియేటర్లను ముందే ఓపెన్ చేయాలని అనడం లేదని.. అన్నింటితో పాటే వాటిని కూడా తెరవాలని నాని అన్నాడు. థియేటర్ల మీద ఆధార పడ్డ వాళ్లు గత ఏడాది కాలంలో ఎన్నో ఇబ్బందులు పడి.. ఆ ఇండస్ట్రీ బాగా దెబ్బ తిందని నాని అన్నాడు. తన ‘టక్ జగదీష్’ సినిమా థియేటర్లలోకి రావడానికి చూస్తోందన్న ఉద్దేశంతో తాను ఇదంతా మాట్లాడలేదని.. ఒక సగటు సినీ అభిమానిగా ఈ మాటలు అంటున్నానని.. ప్రభుత్వాలు ఆలోచించాలని నాని అన్నాడు. ఈ స్పీచ్‌కు ఇండస్ట్రీ జనాలతో పాటు సగటు సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.