ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఈ నెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు. అయితే, ఈ పిటిషన్ కు సంబంధించి తాము కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ అధికారులు గడువు కోరారు.
దీంతో, జులై 26 నాటికి లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు గడువునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పిటిషన్ పై విచారణ నేడు మరోసారి జరగింది. సీబీఐ తరఫున వాదించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనారోగ్య కారణాల రీత్యా నేడు లిఖితపూర్వక కౌంటర్ ధాఖలు చేయలేకపోయామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. తమకు లిఖిత పూర్వక వాదనలు సమర్పించేందుకు మరింత గడువు కావాలని ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.
వాస్తవానికి ఈ రోజు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణలో తుది తీర్పు వస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే సీబీఐ అధికారులు పది రోజుల గడువు తీసుకోవడంతో….నేడు లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తారని అంతా అనుకున్నారు. అయితే, అనారోగ్య కారణాలతో రాలేకపోయామని, తమకు మరింత గడువు కావాలని కోర్టును వారు కోరడంతో ఈ పిటిషన్ పై విచారణ జులై 30వ తేదీకి వాయిదా పడింది.