తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరికొత్త సవాల్ ఎదురైంది. తమ పార్టీకి చెందిన ఒక చిన్న నేతను మావోయిస్టులు కాల్చి చంపిన దారుణ ఉదంతంతో ఉలిక్కిపడేలా చేసింది. తమకు వ్యతిరేకంగా పోలీసులు.. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు వ్యతిరేకంగా ఈ దారుణానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కు చెందిన భీమేశ్వర్ ను కిరాతకంగా చంపేశారు. అర్థరాత్రి వేళ డబ్బులు డిమాండ్ చేసేందుకు అతనింటికి వెళ్లారు. అర్థరాత్రివేళ డబ్బులేంటి? ఇప్పుడు ఇచ్చేది లేదన్నందుకు కాల్చి చంపినట్లుగా చెబుతున్నారు. పెను సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో జరిగిన ఈ ఘటనలో అర్థరాత్రి వేళ టీఆర్ఎస్ నేత ఇంటికి వెళ్లారు మావోలు. తమకు డబ్బులు కావాలని అడిగితే లేవని చెప్పారు భీమేశ్వర్. తలుపు కూడా తీయలేదు. దీంతో.. తలుపు మీద తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో.. తలుపు తీసిన ఆ నేతపై దాడికి దిగారు. దీంతో భయపడిపోయిన భీమేశ్వర్ తనను ఏమీ చేయొద్దని.. ఏం చెబితే అది చేస్తానని వేడుకొన్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో భీమేశ్వర్ భార్య సైతం మావోలను వేడుకున్నట్లుగా చెబుతున్నారు. వారెంతగా బతిమిలాడుతున్నా వినకుండా కత్తులతో దారుణంగా పొడిచి చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు ఒక లేఖను ఘటనా స్థలంలో వదిలి వెళ్లారు. ఈ ఉదంతంపై విచారణ అవసరం లేదని.. తామే హత్య చేసినట్లుగా పేర్కొంటూ మావోలు ఒక లేఖను వదిలి వెళ్లారు.
ఈ దారుణ ఉదంతంలో మొత్తం ఆరుగురు మావోలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఎప్పటిలానే టీఆర్ఎస్.. బీజేపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలన్న డిమాండ్ తో పాటు.. అధికారపార్టీలో ఉండి ప్రజల్ని దోచుకు తింటున్నారని.. అందుకే తగిన శిక్ష విధించినట్లుగా పేర్కొన్నారు. తాము చెప్పినట్లుగా పార్టీ పదవులకు రాజీనామా చేయకుంటే మిగిలిన నేతలకు అలాంటి గతే పడుతుందని హెచ్చరించారు.
తాజా ఉదంతంతో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఒక్కసారిగా అలెర్టు అయ్యింది. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఈ మధ్యన మావోల కదలికలు ఎక్కువ అయ్యాయి. మొన్నటికి మొన్న (గత ఆదివారం) ఇదే ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ మహేందర్ రెడ్డి.. సీఆర్ ఫీఎఫ్ ఉన్నతాధికారిక విజయ్ కుమార్ (స్మగ్లర్ వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేసింది ఈ అధికారే).. తెంగాణ.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల సీఆర్ఫీఎఫ్ డీజీపీలు.. ఐజీ నాగిరెడ్డి.. ఇంటెలిజెన్సు ఐజీ స్టీఫెన్ రవీంద్ర.. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజు తదితరులు పాల్గొనటం గమనార్హం మావోల దుశ్చర్యలకు చెక్ పెట్టేందుకు సమావేశాన్ని నిర్వహించారో.. అక్కడే అధికార పార్టీకి చెందిన నేతను దారుణంగా హత్య చేయటం ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతోంది.