సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలు శిక్ష అనుభవించి…ఆ తర్వాత సీఎం అయిన జగన్ బెయిల్ రద్దవుతుందా? లేదా? ఒక వేళ జగన్ బెయిల్ రద్దయితే తర్వాత సీఎం పగ్గాలు ఎవరు చేపడతారు? అన్న రచ్చబండ సమావేశాలు ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకవేళ జగన్ బెయిల్ రద్దయితే అందరికన్నా ఎక్కువగా లాభపడేది జగనేనని నారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. రఘురామ కోరిక ప్రకారం జగన్ మరోసారి జైలుకు వెళ్లినా జగన్కు వచ్చే నష్టం ఏమీ లేదని నారాయణ తేల్చేశారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో సీఎం అయ్యారని గుర్తు చేశారు. మరోసారి జైలుకు వెళ్తే జగన్ అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని జోస్యం చెప్పారు.
అయితే, జగన్ బెయిల్ రద్దవుతుందో లేదో తెలీదుగానీ…రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని నారాయణ జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడదని నారాయణ అన్నారు. జగన్ బెయిలు రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేయడం తప్పని నారాయణ అభిప్రాయపడ్డారు.
కాగా, జగన్ బెయిల్ రద్దు చేయాలని, బయట బెయిల్ పై ఉన్న జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ తదుపరి విచారణ జులై 26న జరగనుంది. ఈ పిటిషన్ పై జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా జులై 8న సమర్పించారు.అయితే, జులై 8న తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమన్న సీబీఐ…ఆ తర్వాత తాము కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు గడువు కావాలని కోర్టును కోరింది.