ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయన సాక్షులను ప్రభావితం చేస్తూ బెయిల్ ను దుర్వినియోగపరుస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ హైదరాబాద్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. ఈ పిటిషన్ కు సంబంధించి ఈ నెల 8న జగన్, రఘురామ కృష్ణరాజు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు.
అయితే, సీబీఐ మాత్రం తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోమని ఈ నెల 8న కోర్టుకు తెలిపింది. పిటిషన్లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు ఈ పిటిషన్ పై మరోసారి విచారణ జరుగగా…ఈ వ్యవహారంలో సీబీఐ యూ టర్న్ తీసుకుంది. ఈ పిటిషన్ కు సంబంధించి తాము కూడా లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. తమ వాదనలు సమర్పించేందుకు 10 రోజులు గడువు కావాలని కోర్టును కోరింది.
అయితే, సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని రఘురామ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే సీబీఐ అధికారులకు రెండు సార్లు అవకాశమిచ్చారని, ఇప్పుడు మరో అవకాశం ఇవ్వొద్దని కోర్టుకి తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ అనేది దర్యాప్తు సంస్థ కాబట్టి చివరిగా ఒకసారి అవకాశం ఇస్తున్నామని కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను జులై 26కు వాయిదా వేసింది.
మరోవైపు, జగన్ బెయిల్ రద్దు అంశంలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని రఘురామ వ్యాఖ్యానించారు. జగన్ కేసు విచారణకు 11 ఏళ్లు పడుతుందన్నారని, కానీ తన విషయంలో మాత్రం తొందరగా విచారణ జరగాలంటున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్ అంశంలో లేని తొందర తన అనర్హత విషయంలో ఎందుకని వైసీపీ ఎంపీలను ప్రశ్నించారు. ఎంపీ మార్గాని భరత్ తన నియోజవర్గ సమస్యలు కూడా చూస్తా అనడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.