ఏపీలోని జగన్ ప్రభుత్వ కీలక సలహాదారు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి.. సజ్జల రామకృష్ణారెడ్డికి పదవీ గండం పొంచి ఉందా? ఆయనను సలహాదారు పదవి నుంచి తప్పించడం ఖాయంగా కనిపిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒక ప్రభుత్వానికి సలహాదారుగా ఉంటూ.. ఆయన రాజకీయాలు మాట్లాడడంపై కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
అయితే.. ఇంతలోనే ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నీలం సాహ్నిపై విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఆమె.. ప్రభుత్వ సలహాదారుగా ఉంటూనే.. ఎస్ ఈసీగా నియమితులయ్యారని.. ఆమె రాజీనామా చేయకుండానే ఈ బాధ్యతలు చేపట్టారని, ఆమె నియామకం చెల్లదని పేర్కొనాలని కోర్టును అభ్యర్థించారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అసలు సలహాదారులు రాజకీయాలు మాట్లాడవచ్చా? అని హైకోర్టు నిలదీసింది. ప్రభుత్వ సలహాదారులు లక్షల రూపాయల్లో వేతనాలు తీసుకుంటూ.. రాజకీయాలు మాట్లాడడం ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించింది. దీనికి సంబందించి ప్రభుత్వం ఏం చేస్తోందో తేలుస్తామని.. కూడా కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ క్రమంలోనే ప్రభుత్వ సలహాదారుల విధివిధానాలు ఏంటో ప్రభుత్వం వారికి నిర్దేశించిన పని ఏమిటో తమముందు ఉంచాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే.. ఈవిచారణ, కేసు నీలం సాహ్నితోనే పోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ.. రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సజ్జలపైనా పడుతుందని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ రాజు.. ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఆయనను కంట్రోల్ చేయాలని.. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ.. రాజకీయాలు మాట్లాడడం, అనధికార హోం మంత్రిగా వ్యవహరించడం వంటి వాటిని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని.. రఘురామ ఇటీవల పేర్కొన్నారు.
ఇప్పుడు నీలం సాహ్ని కేసు విచారణకు రావడం.. అవకాశం వచ్చినప్పు డల్లా.. సజ్జల… టీడీపీపైనా.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడిపైనా.. రాజకీయంగా వ్యాఖ్యలు చేయడం.. వారిని టార్గెట్ చేయడం వంటివి.. ఆయన పదవికి ఎసరు పెట్టడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇదే జరిగితే.. జగన్ సర్కారుకు మరో ఎదురు దెబ్బఖాయం అని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.