అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగినా…తుదితీర్పు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా…జగన్, రఘురామ తరఫు న్యాయవాదులు తమ వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించారు.
అయితే, ఈ పిటిషన్ పై తాము లిఖితపూర్వక వాదనలు సమర్పించబోవడంలేదని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో, అందరి వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. దీంతో, ఈ కేసు విచారణ మరోసారి వాయిదాపడ్డట్టయింది.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాదు, పిటిషన్ కు తోడుగా రీజాయిండర్ కూడా దాఖలు చేశారు. అక్రమాస్తులకు సంబంధించిన కేసుల్లో తనతో పాటు నిందితులుగా ఉన్నవారికి జగన్ పలు రకాలుగా సాయం చేశారని, సాక్ష్యులను బెదిరించేందుకు పలు మార్గాల్లో ప్రయత్నించారని రఘురామ ఆరోపించారు. జగన్ బెయిల్ రద్దుకు ఈ కారణాలు సరిపోతాయని, జగన్కు బెయిల్ ఇవ్వడం వల్ల బాధితులుగా మారినవారిలో తాను కూడా ఉన్నానని ఆర్ఆర్ఆర్ తెలిపారు.