తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన ఆస్తుల నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. అయితే.. ఆస్తుల నమోదు వేళ బోలెడన్ని సందేహాలు చోటు చేసుకుంటున్నాయి. వీటికి సంబంధించి ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఆస్తుల నమోదుకు వస్తున్న వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం.. వారికి విషయాల మీద పెద్దగా అవగాహన లేకపోవటంతో కిందామీదా పడుతున్నారు.
ఆస్తుల నమోదు ప్రక్రియలో చోటు చేసుకుంటున్న సందేహాల్ని తీర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది. మునిసిపల్ శాఖ ఏర్పాటు చేసిన 040-22666666 ఈ టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేస్తే.. ప్రజలు తమకొచ్చిన సందేహాల్ని తీర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
040-22666666 పేరుతో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబరులో మరో ప్రత్యేకత ఏమంటే.. ఇది 24 గంటలు పని చేస్తుంది. ఆస్తుల నమోదు ప్రక్రియలో తమకొచ్చిన సందేహాల్ని తీర్చుకోవటానికి ఈ టోల్ ఫ్రీ నెంబరు సాయంగా ఉంటుందని చెబుతున్నారు. మరి.. ఆలస్యం ఎందుకు.. డౌట్ ఉంటే చాలు ఫోన్ కొడితే సరి.