మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి ఇటు రాజకీయ రంగంలోనూ…అటు సినీరంగంలోనూ అందరికీ సుపరిచితులే. అయితే, కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటోన్న చిరంజీవి…వరుస సినిమాలతో, షూటింగులతో బిజీగా ఉన్నారు. అలా అని చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో, టెక్నికల్ గా చిరు కాంగ్రెస్ లో ఉన్నట్టేనని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అసలు చిరు కాంగ్రెస్ లో లేరంటూ ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఊమెన్ చాందీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయవాడలో పర్యటించిన ఊమెన్ చాందీ…పార్టీ నేతల సమావేశానికి రావాలని చిరంజీవికి ఆహ్వానం పంపినా…స్పందన లేదట. ఇలా చాలా సార్లు సందేశం పంపినా చిరంజీవి నుంచి కనీస స్పందన కరువైందనట. దీంతో చిరంజీవి ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని, ఆయన సినిమాల్లో బిజీగా ఉన్నారని ఊమెన్ చాందీ మీడియా ముందు అనేశారు. దీంతో, ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే చిరు కాంగ్రెస్ లో లేరంటూ ప్రచురితమైన వార్తలపై ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ తాజాగా ప్రెస్ నోట్ విడుదల చేశారు. చిరంజీవి కాంగ్రెస్ వాదేనని ఏఐసీసీ, ఏపీసీసీ స్పష్టం చేస్తున్నట్టుగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సినీ రంగంలో బిజీగా ఉండడం వల్లే చిరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని మాత్రమే చాందీ చెప్పారని, అంతమాత్రాన చిరు కాంగ్రెస్ వాది కాదని అని కథనాలు రాయడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి, ఆయన కుటుంబం మొదట నుంచి కాంగ్రెస్ వాదులని అన్నారు.
భవిష్యత్తులో చిరంజీవి సేవలు పార్టీకి అందుతాయని..ఆయన క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో సాకే శైలజానాధ్ స్పష్టం చేశారు. అయితే, చిరంజీవి పార్టీలో ఉన్నారో లేదో ఆయన నోటితోనే చెప్పించడం కోసమే ఈ ప్రకటనలు తెరపైకి వచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కు తెలియకుండా చిరంజీవి గురించి ఇంత పెద్ద ప్రకటన ఊమెన్ చాందీ చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, శైలజానాథ్ ప్రకటనలో కూడా చిరు కాంగ్రెస్ వాది అన్నారుగానీ…చిరు కాంగ్రెస్ లో ఉన్నారని, రాజీనామా చేయలేదని చెప్పకపోవడం గమనార్హం. అంటే చిరు కాంగ్రెస్ లో లేరన్న విషయం శైలజానాథ్ సహా కాంగ్రెస్ నేతలందరికీ, ఆ మాటకొస్తే ప్రజలందరికీ తెలుసు. కానీ, చిరు నోటితో ఆ మాట చెప్పించాలనే ఇలా భిన్న ప్రకటనలు ఇచ్చారని అనుకుంటున్నారు. మరి, ఈ ప్రకటనలపై చిరు రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.