సీఎం జగన్ తర్వాత వైసీపీలో నంబర్ 2గా కొనసాగుతోన్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ ఏ1 అయితే…విజయసాయి ఏ2 అని…పార్టీలోనూ వీరిద్దరూ ఏ1, ఏ2లుగా కొనసాగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక, పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్…అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని నియమించారని విమర్శలు వస్తున్నాయి.
అటువంటి విజయసాయి…టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయసాయిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి బ్రోకర్ వృత్తిలో ఉన్న వారందరికీ కుల పెద్ద అని, జైల్లో ఉండి వచ్చిన అవినీతి చిప్పకూడు బ్యాచికి సలహాదారు అని షాకింగ్ కామెంట్లు చేశారు.
గూగుల్లో ఏ2 అని కొడితే విజయసాయి పేరే వస్తుందని,.వేల కోట్ల అవినీతికి పాల్పడటం ఎలా అంటూ సలహాలు ఇచ్చిన నైపుణ్యానికి 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన ఘనుడు విజయసాయి అని ఎద్దేవా చేశారు. విశాఖలోని భూదందా చేస్తున్న విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డిల దగ్గర బ్రోకరిజం చేసి పైకి వచ్చిన విజయసాయికి…అంచెలంచెలుగా ఎదిగి 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నిప్పులు చెరిగారు.
చంద్రబాబుపై ఒక్క కేసు కూడా నిలబడలేక వాటిని ఉపసంహరించుకొన్నారని, రాజశేఖరరెడ్డిని తెలంగాణ మంత్రులు నోటికి వచ్చినట్లు తిడుతుంటే విజయసాయి, జగన్ కిక్కురుమనడం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ తో వైసీపీ లాలూచికీ ఇదే సాక్ష్యం అని విమర్శించారు. కేసుల భయంతో నాడు సోనియా గాంధీ, నేడు మోడీ చుట్టూ తిరుగుతున్నారని, ఇటువంటి వ్యక్తులు చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని బండారు మండిపడ్డారు.