తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతటి మాటకారో అందరికీ తెలిసిందే. తన వాక్చాతుర్యంతో ప్రజలతోపాటు ప్రతిపక్ష నేతలనూ ఆకట్టుకోగల నైపుణ్యం కేసీఆర్ సొంతం. తనకు చిరాకు తెప్పించే ప్రశ్నలు అడిగిన మీడియా మిత్రులకు సైతం తన హాస్యచతురతతో సమాధానమిచ్చే నేర్పరి కేసీఆర్. ఇక, తాజాగా సిద్దిపేట పర్యటనలో ఉన్న కేసీఆర్…తనకు కరోనా ఎలా సోకిందో చెప్పిన ముచ్చటకు అక్కడున్న ఎమ్మెల్యేలు, అధికారులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.
సిద్ధిపేటలో పర్యటించిన కేసీఆర్… పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లా నూతన సమీకృత కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం, కమిషనరేట్ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాన్ఫరెన్స్ హాల్ లో మాట్లాడిన కేసీఆర్…తనకు కరోనా ఎలా సోకిందో అనే విషయాన్ని చెప్పి నవ్వుల పువ్వులు పూయించారు. కరోనాతో జనమంతా ఆగమాగమయితున్నరన్న కేసీఆర్…తన మాస్క్ ను తీయడం వల్లే తనకు కరోనా సోకిందని చెప్పారు.
కరోనాతో మూతికో బట్ట, ముడ్డికో బట్ట. ఇదేం పంచాయితీయో…అంటూ కేసీఆర్ చెప్పిన మాటలకు అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. ”పెండ్లికి పోతే పెళ్లి పిల్లగాడు ‘సార్ మాస్క్ తీ’ అన్నాడు. ఎందుకురా భయ్? అంటే ‘నువ్వు మళ్లా దొరుకుతావా సర్.. ఫొటో కావాలి’ అన్నాడు. నేను నీకు దొరుకుతానోలేదో మాస్క్ తీస్తే కరోనాకు దొరుకుతా కదరా భయ్ అన్నా. అలా వాడు గుంజి.. వీడు గుంజి నాక్కూడా వచ్చింది కరోనా.’’ అంటూ కేసీఆర్ తన మార్క్ స్పీచ్తో అక్కడున్నవారందనీ నవ్వించారు. ఇలా కేసీఆర్ తనకు కరోనా ఎలా సోకిందో చెబుతూ నవ్వులు పూయించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.