మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ ఔషధం… ఇది కరోనా మందుల్లో ఒక విప్లవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కరోనా సోకినపుడు వాడిన మందు ఇదే. దీనిని వాడి ఆయన క్షేమంగా కరోనా నుంచి బయటపడినట్లుగా చెబుతారు.
ఇపుడు రోచ్ ఇండియా.. సిప్లా సంస్థలు సంయుక్తంగా దీనిని భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ వైద్యుడు డా. నాగేశ్వర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.
ఈ ఔషధాన్ని 40 మంది కరోనా రోగులకు అందించగా సానుకూల ఫలితాలు వచ్చాయని… అయితే, ‘కాక్టెయిల్’ తీసుకున్న వారంతా లైట్ కొవిడ్ ఇన్ఫెక్షన్ కలిగినవారేనని వెల్లడించారు. కాక్టెయిల్ మందును తీసుకున్న 24 గంటల్లోనే నలభై మంది రోగుల్లోను జ్వరం, నీరసం వంటి కొవిడ్ లక్షణాలన్నీ వెంటనే మటుమాయం అయ్యాయని ఆయన వివరించారు.
విలయం సృష్టిస్తున్న డెల్టా వేరియంట్‌పై ఈ ఔషధం పనితీరును తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని, అందులో భాగంగా తమ ఆస్పత్రి ఆధ్వర్యంలో పెద్దఎత్తున అధ్యయనం నిర్వహిస్తున్నట్లు నాగేశ్వర్ రెడ్డి వివరించారు. ఈ మందు ఇచ్చిన వారం తర్వాత కరోనా రోగులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నిర్వహించగా వారిలో కరోనా వైరస్ పూర్తిగా మాయమైనట్లు స్పష్టమైందన్నారు.
ఈ మెడిసిన్ ప్రత్యేకత ఏమంటే.. ఒక మోస్తరు నుంచి తీవ్రంగా కొవిడ్ తో బాధ పడుతున్న వారు దీన్ని వాడొచ్చు. ఈ యాంటీబాడీ కాక్ టెయిల్ వినియోగంతో కొవిడ్ బాధితులు ఆసుపత్రిలో జాయిన్ అయ్యే అవసరం దాదాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి భారత ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది.