బిగ్ బాస్ విజేత కౌశల్ గురించి.. అతడి ఆర్మీ గురించి.. దాన్ని నడిపించిన ఆయన సతీమణి నీలిమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తరచూ వార్తల్లో ఉండే ఆమె.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితుల్లో వార్తల్లోకి వచ్చారు. ఆమె ఆరోగ్యంపై కౌశల్ ఆందోళన వ్యక్తం చేయటం.. అసలేం అయ్యిందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. క్లారిటీ లేని వార్తలతో కౌశల్ వైఫ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న సందేహాలు వచ్చాయి. తాజాగా వీటన్నింటికి సమాధానాలు వచ్చేలా నీలిమ సమాధానాలు ఇచ్చారు.
ప్రస్తుతం నీలిమ యూకేలోని లండన్ లో ఉన్నారు. ఆమె అక్కడ జాబ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన ఆమెకు కరోనా సోకింది. భారత్ లో పరిస్థితి చాలా దారుణంగా.. భయంకరంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో.. తాను లండన్ లో ఉన్నాను కాబట్టి వైద్య సాయానికి ఇబ్బంది ఉండదని అనుకున్నదట. కరోనా కారణంగా ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా మారిందట.
దీనికి తోడు ఛాతీ నొప్పి తోడు కావటం.. ఆయాసం ఎక్కువ కావటంతో ఆమె అక్కడి ఆసుపత్రికి వెళ్లారట. తన పరిస్థితి బాగోలేదని వైద్యులకు చెబితే.. వాళ్లు కేవలం పారాసిటమాల్ మాత్ర ఇచ్చి తగ్గిపోతుందని చెప్పారట. ఇంకేం చెప్పినా వినలేదట. తన మాటలకు వారిచ్చిన సమాధానం.. కరోనా లక్షణాలు అలానే ఉంటాయన్న సలహా ఇచ్చారట. తన జీవితంలో ఎదురైన అత్యంత చేదు అనుభవం ఇదేనని ఆమె చెప్పారు.
యూకేలో వైద్యం గొప్పగా ఉంటుందని తాను అనుకున్నానని.. అయితే ఇక్కడ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ‘‘మన దేశంలో అయితే వెంటనే వైద్యం చేస్తారు. ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనలతో నేను బాగున్నా. త్వరలోనే భారత్ కు వస్తా’’ అని నీలిమ ఒక చిట్టి వీడియోలో తన హెల్త్ కండీషన్ గురించి చెప్పారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ప్రస్తుతానికి నీలిమ ఆరోగ్యం బాగుందన్న మాట కౌశల్ అభిమానులకు ఊరట కలిగిస్తోంది.