గత ఆరు నెలలుగా అనేక మలుపులతో, ఎత్తులు కుయుక్తులతో, కప్పదాట్లతో, బేర సారాలతో, విష ప్రచారాలతో, నిరంతర ప్రయాణాలతో, బుజ్జగింపు-బెదిరింపులతో, దాగుడుమూతలతో మహాభారత కురుక్షేత్ర స్థాయిలో జరిగిన ‘తానా’ ఎన్నికల ప్రచార యుద్ధం బాలట్ లు పోస్ట్ అయిన మూడో రోజు నుండి విశృంఖల విశ్వరూపం తో బాలట్ ల కల్లెక్షన్లకై సమాజంలో పేరెన్నికగన్న వ్యక్తులు కూడా ఆరాటపడటం సభ్యసమాజానికి మింగుడు పడటానికి కొన్ని ఏళ్ళు పట్టవచ్చును. ఏ పోరాటంలోనైనా గెలుపు ముఖ్యమైనా గాని, పోరాటమెటువంటిది, పోరాడే వ్యక్తులెటువంటివారు, పోరాట విధానాలేంటి, వాడిన ఆయుధాలేమిటి, వెనుక దన్నుగా ఉన్న వ్యక్తులు ఎవరు, అభ్యర్థుల మరియు వారి సపోర్ట్ వ్యక్తుల స్వభావమెటువంటిది, ఎన్నిక జరిగే సంస్థ ఆశయాలకు ఎంత దగ్గరగా వ్యవహారాలు నడిచాయి అనేది ఒక్కసారి గమనిస్తే ఎవరికైనా దిమ్మతిరిగక మానదు.ఈ ప్రహసనం మొత్తం మీద స్వతంత్రంగా పోటీ చేస్తూ హుందాగా సంస్థ ఆశయాలకు అనుగుణంగా ప్రచారంచేసుకున్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థి శ్రీనివాస గోగినేనిని మినహాయిస్తే,పైనుండి క్రింది వరకు అన్ని పదవులకు పోటీ చేసిన రెండు వర్గాలు సంస్థ ప్రయోజనాలు, అభివృద్ధి కంటే స్వలాభాలు, ప్రతీకారాలు, ఆధిపత్య ధోరణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది.
గత కొన్ని సంవత్సరాలుగా ‘తానా’ లో ఒకే వర్గం బలంగా పాతుకుపోయి తమకు అనువుగా ఉన్నవారినే రకరకాల ప్రయోగాలతో జాగ్రత్తగా నాయకత్వంలో ఎంపిక చేసుకుంటూ భవిష్యత్తు కూడా తమ చేతిలోనే ఉండేటట్లు గా వ్యవహరించింది. అయితే వీరి సహాయసహకారాలతోనే కొద్ది సంవత్సరాలుగా పదవులు పొంది కొన్ని నెలల క్రితం నుంచి గూడు పుఠాణీగా అంతర్గత కార్యకలాపాలతో కూటమిగా ఏర్పడి, ఒక్కసారిగా వేరే వర్గంగా అవతరించడం తో పాటు ఇంచుమించు సంస్థను గుప్పిట్లోకి లాగేసుకున్నట్లు వ్యవహరించడం ముందు నుంచి ఉన్న వర్గానికి ఆగ్రహం తెప్పించింది. కొద్దిగా లేటుగా, షాకుల నుంచి క్రమంగా తేరుకుని, ఒకింత తడబాటుతో టీంను తయారు చేసుకొని ఎదురు దాడికి దిగి జవసత్వాలను కూడగట్టి ప్రచారంలోకి దిగి నిరంతర శ్రమతో సమాన స్థాయి లో ఢీ కొట్టకలగడం చాలా మందిని ఆశ్చర్యపరచింది. ఈ మొత్తం పోరాటం మధ్యలో అనేక చిత్ర విచిత్ర పరిణామాలు జరుగగా అప్పుడప్పుడూ జరిగిన నెగటివ్ విష ప్రచారాలు, గోడ మీది పిల్లుల గంతులు వివిధ వ్యక్తుల నిజ స్వరూపాలను బయట పెట్టాయి. చివరికి నరేన్ కొడాలి టీం మరియు నిరంజన్ శృంగవరపు టీం రెండూ విజయం తమదే అనే ధీమాతో ఎన్నికల కౌంటింగ్ కు సమాయత్తమయ్యాయి.
బాలట్ లు పోస్ట్ అయినా తరువాత రెండు వర్గాలు ఇంచుమించు ప్రతి ఒక్క ‘తానా’ ఓటరును అనేక విధాలుగా చేరుకొని ప్రభావితం చేసి పోలయ్యే ఓట్లలో 75% పైగా ఓట్లను తమ గుప్పిట్లో తెచ్చుకోగలగడం నమ్మలేని నిజం. గత కొద్ది నెలలుగా ఆకట్టుకొనే స్థాయిలో చైతన్యవంతంగా పని చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస గోగినేని ప్రచారానికి స్పందిస్తూనే ఓటు వరకు వచ్చేటప్పటికి ఆయన మంచివాడే కానీ గెలవడేమో ననే అనుమానంతో తమకు నచ్చనివారు గెలవకూడదని, మిగతావారిలో బెటర్ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతూ బాలట్ కవర్ చేతికి ఇచ్చివేయడం ఓటర్లలో జీర్ణమై పోయిన వర్గ మనస్తత్వానికి అద్దంపడుతూంది. పైగా ఉత్తర అమెరికాలో ఎంతో ప్రతిభ తో సెటిల్ అయిన విద్యావంతులైనవారు తమ బాలట్లను తాము గాక వేరెవరికో ఇవ్వడం సంస్థ భవిష్యత్తు పై అంతగా సీరియస్ గా లేకపోవడమూ, ఒత్తిడులను భరించలేక పోవడమూ, ఈ తలనొప్పి తమకెందుకు అనుకోవడమూ మూలంగా బాలట్ కవర్లు ఓటర్ల నుండి బ్యాలెట్ బాక్సులకు కాక వర్గాల గాడ్ ఫాదర్ ల కు చేరడం ఎంతైనా చర్చనీయాంశమే. ఇక ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు తమ వద్ద కంటే తమ వద్ద ఎక్కువ బ్యాలట్ కవర్లు చేరుకున్నాయంటూ చెప్పుకోవడం నిజంగా ‘తానా’ ఓటర్లు కు అవమానకరమే.
ఏదేమైనా ఈ రోజున జరిగే ఓట్ల లెక్కింపు ఓటర్ల మనోగతం ఏమిటో కాక, ఏ వర్గం ఎక్కువ కలెక్టు చేసిందో అనే దానిమీదే ఆసక్తి అనే విషయం సుస్పష్టం. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ ఎన్నికల ఫలితాల తరువాత ‘తానా’ సంస్థలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ ఫలితాల్ని బట్టే ఉంటాయని చెప్పవచ్చును.