తనను సిఐడి పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి రఘురామకృష్ణరాజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. లాఠీలతో తన కాళ్లకు గాయాలయ్యేలా పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టు న్యాయమూర్తికి తెలియజేశారు. గత రాత్రి తనను వేధింపులకు గురిచేశారని, అరికాళ్లు వాచిపోయేలా కొట్టారని లిఖిత పూర్వకంగా వివరించారు. పోలీసులు తనతో ఎలా ప్రవర్తించిందీ…. నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదులో ఆయన తెలిపారు.
ఏపీ సీఐడీ అధికారులు ఈ సాయంత్రం రఘురామకృష్ణరాజును సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు రిమాండ్ నివేదికను న్యాయమూర్తికి సమర్పించారు. అతనికి రిమాండ్ విధించాలని కోరారు.
అయితే, రఘురామకృష్ణరాజు తనకు బెయిల్ మంజూరు చేయాలని ఓ పిటిషన్, అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకు తగిలిన గాయాలను చూసి రిమాండ్ నివేదికను పెండింగ్ లో ఉంచిన న్యాయస్థానం… ఆయనను ఆసుపత్రికి తరలించాలని ఆదేశించినట్టు సమాచారం ఉంది.