వైసీపీ నాయకుడు, ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ గన్నవరం ఆఫీసుపై దాడి, ఫర్నిచర్ సహా కారును తగల బెట్టిన వ్యవహారంపై ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను బెదిరించారన్న కేసులో వంశీ అరెస్టయ్యారు. ఆయనను కిడ్నాప్ చేయడంతోపాటు పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా వత్తిడి చేశారని వంశీపై కేసు పెట్టిన విజయవాడ పోలీసులు.. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
ప్రస్తుతం 14 రోజుల రిమాండ్‌లో ఉన్న వంశీ తనకు బెయిల్ కావాలని కోరుతూ.. రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్‌పై గురువారం తొలి సెషన్లోనే కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ.. వంశీకి బెయిల్ ఇస్తే.. అమెరికా పారిపోతారని..ఆయనను తీసుకురావడం కష్టమవుతుందన్నారు. అంతేకాదు.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నిందితుడికి మూడు మాసాల వరకు బెయిల్ ఇవ్వరాదన్నది చట్టం చెబుతున్న విషయంగా పేర్కొన్నారు.
ఇక,వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వంశీ మాజీ ప్రజాప్రతినిధి అని..ఆయ న ఎక్కడికీ పారిపోరని..పైగా ఇది అక్రమ కేసు అని వివరించారు. అంతేకాదు.. ఎవరూ తనను బెదిరించలేదని.. సత్యవర్థన్ చెబుతున్నందున వంశీకి బెయిల్ ఇవ్వాలని ఆయన కోరారు. వంశీపై నమోదైన కేసులు కేవలం రాజకీయ ప్రేరేపితమేనన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. మరోవైపు.. గత రికార్డులను కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు.
ఈ రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి.. వంశీ పై నేరచరిత్ర ఉందని.. ఆయనకు బెయిల్ ఇస్తే.. తప్పించుకునే అవకాశంతోపాటు.. సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అనంతరం..బెయిల్ పిటిషన్‌ను కొట్టి వేస్తూ తీర్పు చెప్పారు. అయితే.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో వంశీకి తొలి ప్రయత్నంలోనే భారీ ఎదురు దెబ్బ తగిలింది.