ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు మరో షాకిచ్చింది. కేటీఆర్ అరెస్టు పై ఉన్న స్టేను ఎత్తివేయడంతో పాటు ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు తాజాగా కేటీఆర్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఏసీబీ విచారణ సమయంలో తన పక్కన తన లాయర్ కూర్చునేలా అనుమతించాలంటూ కేటీఆర్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.
అయితే, ఏసీబీ విచారణ సమయంలో లాయర్ దూరంగా ఉండి గమనించేందుకు మాత్రం అనుతినిస్తామని పేర్కొంది. అయితే, ఇలా విచారణను లాయర్ గమనించే అవకాశముందా అని ఏసీబీ తరఫు వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ ను కోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై ఏఏజీ వాదనలను బట్టి తుది నిర్ణయాన్ని కోర్టు వెల్లడించనుంది.
మరోవైపు, ఫార్ములా ఈ రేసు కేసు గురించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది రేవంత్ రెడ్డి పెట్టించిన లొట్టపీసు కేసు అని, దానికి తాను భయపడబోనని సంచలన కామెంట్లు చేశారు. ఈ కేసు విషయం తాను చూసుకుంటానని, ఏసీబీ కేసు పెద్ద విషయం కాదని, ఈ కేసుల గురించి ఆందోళన, ఇబ్బంది లేదని కార్యకర్తలతో అన్నారు. సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తానని, ఈ రేసులో ఒక్క పైసా అవినీతి జరగలేదని చెప్పారు.
హైడ్రా, లగచర్ల బాధితులతో పోలిస్తే ఈ కేసు పెద్ద ఇబ్బంది కాదని అన్నారు. అయినా, తెలంగాణ సాధన కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నామని, ఇటువంటి కేసులు లెక్క కాదని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం పార్టీ పెట్టినపుడు వచ్చిన ఇబ్బందుల కంటే ఇవి ఎక్కువ కాదన్నారు. రైతు సమస్యలపై, రుణమాఫీ, రైతు భరోసా, కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.