హైడ్రా విషయంలో తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. హైడ్రా ఏర్పాటు నుంచి చెబుతున్న ప్రత్యేక పోలీస్ స్టేషన్ కు అనుమతులు జారీ చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. దీంతో.. ప్రభుత్వ స్థలాల్ని.. చెరువులను కబ్జా చేస్తే హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు. దీని ఆధారంగా హైడ్రా పోలీసులు కేసు నమోదు చేసే వీలు ఉంటుంది. ఇదే విషయాన్ని రేవంత్ సర్కారు విడుదల చేసిన జీవోలోనూ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్ ను బుద్ధభవన్ లో ఏర్పాటు చేస్తున్నట్లుగా హోంశాఖ మంగళవారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా ఏసీపీ స్థాయి అధికారి ఉండనున్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ కు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని కోరుతూ డీజీపీకి రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటివరకు హైడ్రా తీసుకునే చర్యల వేళలో.. వారికి అవసరమైన భద్రతకు.. కూల్చివేతల సమయంలో కట్టడికి స్థానిక పోలీసుల సాయం తీసుకోవాల్సి వస్తోంది. అదిప్పుడు లేకుండా.. తన సొంత పోలీస్ సిబ్బందితో పనులు చేసుకునే వీలు ఉంటుంది. హైడ్రాను ఏ లక్ష్యంతో అయితే ఏర్పాటు చేశారో.. ఆ దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తుందన్న దానికి హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఒక పెద్ద ముందడుగుగా చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. మంగళవారం హైడ్రాకు మరో గుడ్ న్యూస్ అందింది.
దశాబ్దాల తరబడి సాగుతున్న బతుకమ్మ కుంటపై హైడ్రాకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. బతుకమ్మ కుంట స్థలం తమదేనంటూ ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. అదే సమయంలో హైడ్రా వాదనను సమర్థించింది. తాజాగా ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ లో బతుకమ్మకుంటను.. కుంటగా గుర్తించింది. బతుకమ్మకుంట చెరువును పునరుద్ధరించేందుకు హైడ్రా తీసుకునే చర్యలు సక్రమమే అంటూ తీర్పును ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హైడ్రాకు మరింత జోష్ వచ్చినట్లైందని చెప్పాలి. బతుకమ్మకుంటపై ఎంతోకాలంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు వాదనకు హైకోర్టు తీర్పు బలం చేకూరేలా చేసింది. 1962 లెక్కల ప్రకారం మొత్తం 14 ఎకరాల 6 గుంటల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉంది. తాజా సర్వే ప్రకారం అక్కడ 5 ఎకరాల 15 గుంటల భూమి మాత్రమే మిగిలి ఉంది.
ప్రభుత్వం తరఫు సంబంధిత పత్రాలను కోర్టుకు సమర్పించి.. అనుకూల తీర్పు రావటంలో క్రెడిట్ మొత్తం కూడా హైడ్రాకే దక్కుతుందని చెప్పాలి. దీంతో.. ఈ విషయంలో సమర్థంగా వ్యవహరించి.. ప్రభుత్వం తరఫు వాదనలను బలంగా వినిపించిన లా టీంకు.. రెవెన్యూ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ సన్మానించిన వైనం ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. ఒకే రోజు రెండు గుడ్ న్యూస్ లు హైడ్రా ఖాతాలో పడ్డాయని మాత్రం చెప్పొచ్చు.