సంధ్య థియేటర్ ఇష్యూలో కొత్త మలుపు చోటుచేసుకుంది. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు ట్రెండ్ చేస్తున్నారు. అసలు సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగిందో ఇప్పటికే అటు పోలీసులు, ఇటు అల్లు అర్జున్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడేమో కొత్తగా బన్నీ రాక ముందే తొక్కిసలాట జరిగిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి చర్యలు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లేందుకే చేస్తున్నా.. అవి చివరకు వికటించి బన్నీ మీదే ప్రభావం చూపుతున్నాయి.
ఈ నేథప్యంలోనే సంధ్య థియేటర్ ఇష్యూలో ఫేక్ పోస్టులు చేస్తున్న వారికి హైదరాబాద్ పోలీసులు స్ట్రోంగ్ వార్నింగ్ ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు ట్రెండ్ చేస్తూ పోలీస్ శాఖను బద్నాం చేస్తున్నారని.. ఇటువంటి చర్యలు తాము సహించబోమని పేర్కొన్నారు.
ఇప్పటికే ఘటనపై నిజాలను వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచామని.. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సిటీ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆధారాలు, సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు.