ఒక్కోళ్ల తీరు ఒక్కోలా ఉంటుంది. దాన్ని తప్పు పట్టలేం. అలా అని ఒక వ్యక్తి తీరు ఒక్కోసారి ఒక్కోలా ఉండటం చాలా అరుదు. సీరియస్ గా ఉంటారా? సోషల్ గా ఉంటారా? కామెడీగా ఉంటారా? కెరీర్ ఓరియంటెడ్ గా ఉంటారా? తెగించినట్లుగా వ్యవహరిస్తారా? భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతారా? రూల్ మాష్టర్ మాదిరి వ్యవహరిస్తారా? లాంటి అనేకం ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. ఈ లెక్కన అల్లు అర్జున్ ఎలా ఉంటారు?
అన్నది పక్కన పెడితే..ఆయన నటించిన పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ ను చూస్తే.. ఎదగాలన్న కసి.. డబ్బుతో ఏదైనా కొనేయొచ్చన్నట్లుగా వ్యవహరించటమే కాదు.. తన చుట్టూ ఉన్నోళ్లు ఎవరైనా సరే.. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని.. దాన్ని డబ్బులతో కొనేయొచ్చన్నట్లుగా వ్యవహరిస్తారు.
రీల్ లో ఉండే క్యారెక్టర్లు మొత్తం డైరెక్టర్ చెప్పినట్లే నడుస్తాయి. కానీ.. రియల్ జీవితంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తారు. కొందరు ఎవరు చెప్పినా వినరు. ఎందుకంటే.. రీల్ లో హీరో ఒక్కడే. కానీ.. రియల్ లో ప్రతి ఒక్కరు హీరోనే. ఎవరికి వాడు హీరోనే. ఈ విషయాలు అల్లు అర్జున్ మనసుకు రావా? అన్నది ప్రశ్న. ఆసుపత్రికి వెళితే లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పారని అందుకే వెళ్లలేదన్న ఆయన.. సీఎంకు కౌంటర్ గా ప్రెస్ మీట్ పెడితే.. లీగల్ ఇష్యూస్ తో పాటు మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పలేదా?
తనను అభిమానించి.. ఆరాధించే ఒక కుటుంబం తన సినిమాను చూసేందుకు ఒక్కో టికెట్ రూ.1300 పెట్టి కొనేంత అంటే.. దానిని ఏమనాలి? అలాంటి వీరాభిమాని ఫ్యామిలీలో తన సినిమా చూసేందుకు వచ్చి.. తాను కూర్చున్న చోటుకు కేవలం 200 – 300 మీటర్ల దూరంలో చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత సినిమా చూడాలన్న ఆలోచన రావటం ఏమిటి? తాను సినిమా మధ్యలో లేచి వెళ్లిపోతే.. సినిమా బాగోలేదని ప్రచారం చేస్తారన్న ఆలోచన రావటం ఏమిటి? ఎవరో ఏదో అనుకుంటారని.. దాని కారణంగా తన సినిమాకు జరిగే వ్యాపారం దెబ్బ తింటుందన్న ఆలోచన.. ఒక మనిషి చనిపోయారన్న సమయంలో రావటం ఏమిటి?
ఇక్కడో విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనసు సరిగా ఆలోచించకపోవచ్చు. కానీ.. ఇంటికి వెళ్లిన తర్వాత కాకున్నా.. తర్వాతి రోజు ఉదయమే అయినా తనను పిచ్చిగా అభిమానించి.. ఆరాధించే కుటుంబంలో ఎవరూ తీర్చలేని విషాదం చోటు చేసుకున్నదని తెలిసిన తర్వాత.. ఆగటం ఏమిటి? లీగల్ ఇష్యూస్ వస్తాయని తనను తాను కంట్రోల్ చేసుకోవటం ఏమిటి? మనసులో ఎలాంటి తప్పుడు ఆలోచనలు లేనప్పుడు.. తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అంటారని ఎందుకు ఆగాలి?
ఒకవేళ లీగల్ ఇష్యూస్ వస్తే.. వాటిని నిజాయితీగా ఎదుర్కొంటానని చెప్పి ఉంటే.. రియల్ లైఫ్ హీరోగా నిలిచేవారు కదా? అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలకు గంటల వ్యవధిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైన తెగింపు ఉన్న వ్యక్తిగా కనిపించిన అల్లు అర్జున్ లో.. అదే సమయంలో లీగల్ ఇష్యూస్ వస్తాయని చనిపోయిన కుటుంబాన్ని పరామర్శకు వెళ్లకపోవటం ఏమిటి? నిజంగా ఎలాంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి? అన్న ప్రశ్న వేసుకుంటే.. బాధిత కుటుంబాన్ని ప్రభావితం చేశారన్న ఆరోపణ తప్పించి ఇంకేమీ రాదు కదా? ఒకవేళ ఆ ఆరోపణతో చట్టపరమైన చర్యలు తీసుకుంటే.. బాధిత కుటుంబం తమను అల్లు అర్జున్ ఎలాంటి ప్రభావానికి గురి చేయలేదని చెబితే.. అందులో ఇంకేం లీగల్ ఇష్యూ ఉంటుంది?
ఒకవేళ.. అనుకోని రీతిలో ఎక్కడో లా పుస్తకాల్లో దాగి ఉన్న అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చారనే అనుకుందాం. అలాంటి వేళ.. ఫర్లేదు.. నా అభిమాని కోసం నేను జైలుకు వెళ్లటానికి సైతం సిద్ధమనే మాట వస్తే.. చట్టాలు.. కోర్టులను పక్కన పెడితే.. ప్రజాకోర్టులో ఒక రియల్ హీరోలా ఎప్పటికి నిలిచిపోయారు కదా? అల్లు అర్జున్ అలా ఎందుకు చేయలేకపోయారు? సినిమాల్లో తాను నటించే పాత్రల్లో ప్రదర్శించే వీరత్వాన్ని ఒక అభిమాని కోసం.. తన కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వారి కోసం అల్లు అర్జున్ ఎందుకు తెగించలేదు? అన్నదే ఇప్పుడు చర్చ. తన ఫ్యాన్ ఇంటికి వెళ్లకపోవటం ద్వారా లీగల్ ఇష్యూస్ నుంచి తప్పించుకున్న బన్నీ.. ప్రజాకోర్టులో తీవ్రమైన నెగిటివిటీని మూటకట్టుకున్నారు కదా? మరి.. ఈ నష్టం అల్లు అర్జున్ కు పెద్దగా పట్టదా?