టాలీవుడ్ సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్, క్రమశిక్షణకు మారుపేరు అయిన మంచు మోహన్ బాబు ఇంట చోటు చేసుకున్న కుటుంబ కలహాలు రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసాయి. ఈ కుటుంబ కలహాలు మంచు వారి ఫ్యామిలీ ఇమేజ్ ను పూర్తిగా డామేజ్ చేయడమే కాకుండా మోహన్ బాబును చిక్కుల్లో పడేసాయి. ఇప్పటివరకు కుటుంబ గొడవల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన పోలీసులు కేసులు నమోదు చేయలేదు.
కానీ ఇటీవల జల్ పల్లి నివాసం వద్ద ఒక మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఈ కేసులో వివరణ ఇవ్వాలని ఇప్పటికే రాచకొండ పోలీసులు మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆ రోజు జరిగిన గొడవలో బీపీ డౌన్ కావడం వల్ల హాస్పిటల్ పాలైన మోహన్ బాబు.. చికిత్స నిమిత్తం విచారణకు హాజరు కాలేరని తెలిపారు. దాంతో విచారణను డిసెంబర్ 24 కు వాయిదా వేశారు.
మరోవైపు హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను తాజాగా హైకోర్టు తిరస్కరించింది. దీనికి తోడు పోలీసులు ఇచ్చిన గడువు కూడా పూర్తి కావడంతో నేడు మోహన్ బాబు అరెస్టు ఖాయమని బలంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇండియాలోనే లేరట. అరెస్ట్ భయంతో ఆయన దుబాయ్ వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. తదుపరి న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకునేవరకూ ఆయన దుబాయ్ లోనే ఉండనున్నారని టాక్ నడుస్తోంది.
ఇక మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనెక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా మోహన్ బాబు హాజరు కాకపోతే అరెస్ట్ కు రంగం సిద్ధం చేయాలని పోలీసులు భావిస్తున్నారట.