లెజెండరీ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘ఇండియన్-2’ ఎంత ఘోరమైన ఫలితాన్ని అందుకుందో తెలిసిందే. శంకర్ కెరీర్లోనే అత్యంత పేలవమైన చిత్రంగా ఇది పేరు తెచ్చుకుంది. రిలీజ్ టైంలో ‘ఇండియన్-2’ మీద జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.
ఈ సినిమా ఫలితం గురించి ఇప్పటిదాకా మాట్లాడని శంకర్.. తన కొత్త చిత్రం ‘గేమ్ చేంజర్’ రిలీజ్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఇండియన్-2కు అలాంటి ఫలితం, రివ్యూలు వస్తాయని తాను ఊహించలేదని శంకర్ వ్యాఖ్యానించాడు. ‘‘ఇండియన్-2 చిత్రానికి అలాంటి నెగెటివ్ రివ్యూలు నేను ఊహించలేదు. కానీ పర్వాలేదు.
ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్, ఇండియన్-3 చిత్రాలతో నా బెస్ట్ వర్క్ ప్రేక్షకులకు అందిస్తాను. ప్రేక్షకులు కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు’’ అని శంకర్ పేర్కొన్నాడు.
‘గేమ్ చేంజర్’ తన కెరీర్లో స్పెషల్ ఫిలిం అని చెప్పిన శంకర్.. ఇందులో రామ్ చరణ్ పాత్ర అద్భుతంగా ఉంటుందని అన్నాడు. ‘‘గేమ్ చేంజర్ సోషియో పొలిటికల్ యాక్షన్ ఫిలిం.
ఒక ప్రభుత్వ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధంలా దీన్ని చూపించనున్నాం. ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాం. చరణ్ తన కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకునే పాత్ర చేశాడు. లుక్, స్టైల్, యాక్షన్, డైలాగ్స్, డ్యాన్స్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆయన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు ఇదొక పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ కంటెంట్ ఉన్న సినిమా’’ అని శంకర్ తెలిపాడు.
చరణ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో అతడి సరసన కియారా అద్వానీ నటించింది. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి ముఖ్య పాత్రలు పోషించారు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది.