సౌర విద్యుత్తు కొనుగోలు విషయంలో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందంపై తీవ్ర ఆరోపణలు రావటం తెలిసిందే. అదానీ గ్రీన్స్ తో చేసుకున్న ఈ ఒప్పందం కారణంగా ఆర్థికంగా భారమే కాదు.. అప్పటి అధికారులు చేసిన సూచనల్ని పెద్దగా పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ తాజాగా ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. అదానీ – జగన్ ప్రభుత్వం మధ్య చోటు చేసుకున్న సోలార్ పవర్ ఒప్పందంపై విమర్శనాత్మక స్టోరీ ఇప్పుడు సంచలనంగా మారింది.
అదానీతో జగన్ సర్కారు చేసుకున్న ఒప్పందాన్ని కంటిన్యూ చేస్తే.. విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో మొదలయ్యే నాటికి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం ఎంతన్న విషయాన్ని ఉదాహరణతో సహా వెల్లడించటం గమనార్హం. ప్రస్తుతం ఏపీ సర్కారు ప్రతి ఏడాది సామాజిక భద్రత.. పోషకాహార కార్యక్రమాలకు ఎంత మొత్తాన్ని వెచ్చిస్తుందో.. దానికి సమాన చెల్లింపులు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
అంతేకాదు.. నాటి ఏపీ రాష్ట్ర సర్కారును సంప్రదించిన సెకి (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా).. విద్యుత్తు కొనుగోలుకు ఓకే చెప్పటం.. ఆ డీల్ కు రాష్ట్ర విద్యుత్తు రెగ్యులేటరీ సంస్థ పచ్చ జెండా ఊపటం లాంటి అన్నీ అంశాలు అసాధారణ వేగంతో సాగినట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉదాహరణల్ని పక్కా ఆధారాలతో సహా పేర్కొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయిటర్స్ పరిశీలించిన రికార్డులప్రకారం ప్రభుత్వాన్ని సెకి సంప్రదించిన తర్వాతి రోజే నాటి ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలో క్యాబినెట్ భేటీ జరగటం.. అందులో ఈ డీల్ కు ఓకే చెబుతూ నిర్ణయం తీసుకోవటం లాంటివి జరిగినట్లుగా వెల్లడించింది.
సెప్టెంబరు 15న సెకి లేఖ రాస్తే.. నవంబరు 11 నాటికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు కొనుగోలు ఒప్పందానికి రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి నుంచి ఆమోదం పొందింది. డిసెంబరు 1న అధికారులు ఒప్పందం మీద సంతకాలు చేశారు. ఈ డీల్ విలువ ఫ్యూచర్ లో ఏడాదికి 490 మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. రాయిటర్స్ పరిశీలించిన ఒప్పంద పత్రాల ప్రకారం సదరు డీల్ విలువలో 97 శాతం అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదానీ గ్రీన్ కు వెళ్లనున్నట్లుగా పేర్కొన్నారు.
7వేల మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత దానికి విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఆమోదం పొందటానికి 57 రోజులే పట్టింది. ఇది చాలా అసాధారణ వేగంగా పేర్కొంది. అంతేకాదు.. అమెరికా ప్రాసిక్యూటర్స్ నుంచి అభియోగాలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి ఆఫీసునకు నవంబరు 28న జారీ చేసిన స్టేట్ మెంట్ ను రాయిటర్స్ బయటపెట్టింది. అందులో ఆయన లంచాలు తీసుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలను ఖండించటంతో పాటు.. రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్తు ఆధారంగా ఈ డీల్ ను సమర్థించుకున్నట్లుగా పేర్కొన్నారు.
దీనికి సంబంధించి తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటానికి జగన్ ఆఫీసు నో చెప్పినట్లుగా వెల్లడిస్తూ.. ఈ డీల్ కు సంబంధించి బాధ్యత వహించాల్సిన ఏపీఈఆర్ సీని తాము పదే పదే ప్రశ్నలు అడిగినా.. రిప్లై లేదన్న విషయాన్ని పేర్కొంది. ఇప్పుడీ కథనం సంచలనంగా మారింది. దీనిపై జగన్ అండ్ కో ఎలా రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా చెప్పక తప్పదు.