టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీ అధిష్టానానికి గతంలో తలనొప్పి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో శ్రీనివాసరావుకు సీఎం చంద్రబాబు క్లాస్ పీకడంతో వ్యవహారం సద్దుమణిగింది. అమరావతి ఉద్యమ నేతగా చంద్రబాబుకు చేరువైన కొలికపూడిపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అయితే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శ్రీనివాసరావు తీరు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.
తాజాగా వైన్ షాపులు బలవంతంగా మూయించి వేసి శ్రీనివాసరావు మరోసారి వార్తల్లో నిలిచారు. బెల్ట్ షాపులకు సదరు వైన్ షాపులు మద్యం సరఫరా చేస్తున్నాయని, కొన్ని వైన్ షాపులు పాఠశాలలకు దగ్గరగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆ షాపులు మూసివేయాలని ఆయన హుకుం జారీ చేశారు. ఇక, సంబంధిత అధికారులపై కూడా శ్రీనివాసరావు చిందులు తొక్కారు.
శ్రీనివాసరావు తీరు బాగోలేదని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలని తెలుగు తమ్ముళ్లు, టిడిపి నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. తిరువూరు టిడిపిలో దశాబ్దాలుగా ఉన్న నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేసిన తర్వాత తీరుమార్చుకుంటానని చంద్రబాబుకు చెప్పారు శ్రీనివాసరావు. కానీ, తాజాగా మరోసారి అదే రీతిలో ఆయన ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు కఠినంగా వ్యవహరించి గాడిలో పెట్టకుంటే తిరువూరు టిడిపికి భారీ డ్యామేజ్ జరిగే అవకాశం లేకపోలేదు.