మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. వలసల పర్వం ఊపందుకుంది. రోజురోజుకు వైసీపీ ఖాళీ అవుతుంది. ఇలాంటి తరుణంలో కేంద్రం జైకొట్టిన జమిలి ఎన్నికలు జగన్ లో కొత్త ఆశలు తీసుకొచ్చాయి. దేశంలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకేసారి నిర్వహించాలన్నదే జమిలీ లక్ష్యం. ఇది అమల్లోకి వస్తే 2027 ద్వితీయార్థంలో ఎన్నికలు వస్తాయని వైసీపీ అంచనా వేసింది.
అందుకు తగ్గట్టుగానే జమిలిపై కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. పార్లమెంటులో ` వన్ నేషన్-వన్ ఎలక్షన్` కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై తొలిసారిగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎన్డీఏ పక్షంగా టీడీపీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు తెలుపగా.. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి మిగతా వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు వ్యతిరేకించాయి.
అనుకూలంగా 269 ఓట్లు రాగా.. 198 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. నిజానికి రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండో వంతు మెజారిటీ రావాల్సి ఉంటుంది. అయితే మూడింటి రెండో వంతు మెజారిటీ రాకపోవడంతో బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. జమిలి లో భాగంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని తెగ సంబరపడిపోతున్న వైసీపీకి ఇది చావు దెబ్బ అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, గత కొద్ది రోజుల నుంచి పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్ జమిలి జపమే జరిపిస్తున్నారు. ఎన్నికలు సమీపంలోనే ఉంటే వైసీపీ నుంచి నేతల వలసలకు కట్టడి వేయొచ్చని జగన్ భావించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో పక్కా ప్రణాళిక తో తమ జండా ఎగర వెయ్యాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అయ్యే అవకాశాలు కనిపించకపోవడంతో జగన్ ఆశలన్నీ నీరుగారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.