టిడిపి యువనేత మంత్రి నారా లోకేష్ కు సొంత పార్టీ నేతలపై బాగా కోపం వచ్చింది. వారు చేసిన పని లోకేష్ కు ఎంత మాత్రం నచ్చలేదట. లోకేష్ కు కోపం ఎందుకు వచ్చింది ? లోకేష్ కోపానికి గురైన ఆ టిడిపి నేతలు ఎవరో ? ఆ స్టోరీ ఏంటో చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ ను టిడిపి నేతలు కలుపుకు వెళ్లడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టిడిపి సర్కిల్స్ లోనే ప్రచారం జరుగుతోంది.
ఏలూరు జిల్లాలోని నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే.. మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథితో పాటు లచ్చన్న మనవరాలు పలాస ఎమ్మెల్యే గౌత శిరీష నూజివీడు పట్టణం అంతా భారీ ఊరేగింపుగా వెళ్లారు. వీళ్ళతో కలిసి అదే వాహనంలో వైసిపి నేత మాజీ మంత్రి.. జోగి రమేష్ కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ ప్రచారంలో జోగి రమేష్ బాగా హైలైట్ అయ్యారు.
కొద్దిరోజులుగా జోగి రమేష్ వైసిపిని వీడతారని.. జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో వైసిపి హయాంలో చంద్రబాబునాయుడు ఇంటి పైకి జోగి రమేష్ ఆధ్వర్యంలోనే వైసీపీ వాళ్లు దాడికి వెళ్లారు. అప్పట్లో జోగి రమేష్ టిడిపి నేతల మధ్య చంద్రబాబు ఇంటి వద్ద పెద్ద హైడ్రామా జరిగింది. అప్పటినుంచి జోగి రమేష్ పై టిడిపి తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీనికి తోడు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయి అంటూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి కుమారుడు రాజీవ్‌ను అరెస్టు చేశారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు రమేష్ చంద్రబాబుపై ఏకవచనంతో రాయలేని పదజాలంతో విరుచుకుపడ్డారు.
ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఆయన లొంగి ఉన్నట్టు కనపడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే జోగి రమేష్ ను జగన్ పెనమలూరు నుంచి మైలవరం వైసీపీ ఇన్చార్జిగా నియమిస్తూ ఆయనకు మరింత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక జోగి కూడా తాను పార్టీ పెడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. అలాంటి నేతను గౌత లచ్చన్న విగ్రహావిష్కరణకు టిడిపి నేతలు అందరూ కలుపుకుని ర్యాలీగా వెళ్లటం పై లోకేష్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. జోగిని ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపిలోకి రానిచ్చేందుకు లోకేష్ కు ఎంత మాత్రం ఇష్టం లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.