రాజకీయాల్లో ఫేట్ మాత్రమేకాదు.. టైం కూడా కలిసి రావాలి. ఈ రెండు వైసీపీ అధినేత జగన్ కు విషమ పరీక్షలే పెడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితమైన పార్టీ.. ఇప్పుడు అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా.. అది ఫలించడం లేదు. కడకు.. కడప కూడా.. అనే పరిస్థితికి వచ్చేసింది. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా.. రాజకీయ ఖిల్లా కడపలో అప్రతిహత విజయం దక్కించుకున్నారు.
అయితే.. పట్టుమని మూడేళ్లు కూడా తిరగకుండానే.. ఇప్పుడు కడపలోనూ వైసీపీ నాయకులు జెండాలు మార్చేస్తున్నారు. కార్పొరేషన్ మొత్తంగా ఇప్పుడు కూటమి వశం కానుంది. కొందరు జనసేనలోకి.. మరికొం దరు టీడీపీలోకి చేరిపోతున్నారు. ఎవరూ ఎవరి మాటా వినిపించుకోవడం లేదు. అంతేకాదు.. తమ దారి తమదేనని తేల్చి చెబుతున్నారు. కడప కార్పొరేషన్లో ఎనిమిది మంది టీడీపీలోకి.. మరో ఎనిమిది మంది జనసేనలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. దీనికి సోమవారమే ముహూర్తం రెడీ చేసుకున్నారు.
ఎందుకు?
వైసీపీ హయాంలో కార్పొరేటర్లు.. కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. పనులు చేయించారు. కానీ, నిధులు ఇవ్వలేదు. తమ సొంత నిధులతో పాటు.. అప్పులు చేసి పనులు చేయించిన వారు కూడా ఉన్నారు. వైసీపీ హయాంలోనే కాళ్లు అరిగేలా తాడేపల్లి చుట్టూ తిరిగారు. కానీ, అధినేత, అప్పటి సీఎం జగన్ కనీసం మొహం చూపించలేదు. దీంతో వారంతా అధినేతపై పీకలదాకా ఆగ్రహంతో ఉన్నారు. మళ్లీ మనప్రభుత్వమే వస్తుందని అనడంతో వేచి చూశారు.
కాని.. ప్రభుత్వం రాలేదు.. వారి సొమ్ములు కూడా తిరిగిరాలేదు. ఈ క్రమంలో ఇక, వైసీపీలో ఉంటే.. ప్రయోజనం లేదని నిర్ణయించుకున్న కార్పొరేటర్లు.. తాజాగా కూటమి పార్టీల బాట పట్టారు. వీరిని నిలువరించేందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రయత్నం చేసినా .. పలితం దక్కలేదు. మరోవైపు.. మైనారిటీ నాయకుడు మాజీ మంత్రి అంజాద్ బాషా సైతం ప్రయత్నించారు కానీ, నాయకులు లెక్కచేయలేదు. కడకు కడప కూడా.. కూటమి వశం కానుంది. చిత్రం ఏంటంటే.. రెండు రోజుల కిందట జరిగిన.. సాగునీటి సంఘాల ఎన్నికల్లోనూ.. కూటమి పులివెందుల సహా కడపలో కనీవినీ ఎరుగని విజయం దక్కించుకుంది.