ఏపీలో ఈ యేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది వైసీపీ. ఓటమి తర్వాత ఆ పార్టీ నుంచి పలువురు కీలక నేతలు జంప్ అయిపోతున్నారు. అసలు ఇప్పుడు తమ పార్టీ పరిస్థితి ఇంతలా దిగజారిపోతోందేంటని ఆ పార్టీ వీరాభిమానులే ఎంతో ఆవేదన చెందుతున్నారు. చివరకు వైసీపీ పరిస్థితి ఎలా పడిపోయిందంటే ఓ సినీ హీరోకు అవసరం లేకపోయినా బలవంతంగా సపోర్ట్ చేసి.. ఆయన అరెస్టు ఖండ ఖండాలుగా ఖండిస్తూ.. ఆ హీరోతో పాటు ఆ హీరో అభిమానుల మద్దతు బలవంతంగా అయినా దక్కుతుందేమో అని ఆశలు పెట్టుకున్నట్టుగా ఉంది.
ఇందులోనూ వైసీపీకి ఆ హీరో మీద ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు.. ఆ హీరో తమకు చుక్కలు చూపించి మొన్న ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తానని శపథం చేసి గెలిచిన పవన్ కళ్యాణ్‌కు కాస్త వ్యతిరేకంగా ఉన్నట్టు వాళ్లు భావించుకోవడమే. ఒక్కటి మాత్రం నిజం.. ఎప్పటకి అయినా వాళ్లందరూ మెగా ఫ్యామిలీయే.. వాళ్లు వాళ్లు ఒక్కటే.. మధ్యలో వైసీపీ చేసే డ్రామాలో వైసీపీ కేడర్ జోకర్లు అవ్వడం మాత్రమే మిగిలి ఉంది.
బన్నీపై వైసీపీ వాళ్లు ఇంత వీరాభిమానం చూపించడం వెనక ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా తెలియంది కాదు. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఇదే వైసీపీ బ్యాచ్ ఆ సినిమాకు ఎంత యాంటీగా ప్రచారం చేసిందో తెలిసిందే. ఇవన్నీ బన్నీకి తెలియనివి కావు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్లు అల్లు అర్జున్ను మించిన నటనా కౌశలంతో నటించేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలనే ఏకంగా తన వద్దకు పిలిపించుకున్న పరిస్థితి.
చిరంజీవి లాంటి స్టార్ హీరో జగన్‌ను ఎంత దయనీయంగా వేడుకున్నారో అందరం చూశాం. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఓ హీరోకు అది కూడా బలవంతంగా సపోర్ట్ చేస్తూ… అలా అయినా తమకు కాసిన్ని ఓట్లు దక్కకపోతాయా ? అన్న స్టేజ్‌కు వెళ్లిపోయారు. కాలం మహిమ అంటే ఇదేనేమో ? అనుకోవాలేమో..!