తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 13 గంటల తీవ్ర ఉత్కంఠకు తెర దించుతూ అల్లు అర్జున్ విడదలయ్యారు. వాస్తవానికి హైకోర్టు మధ్యంతర బెయిల్ కాపీలు అందిన వెంటనే జైలు అధికారులు అల్లు అర్జున్ ను విడుదల చేయాల్సి ఉంది. కానీ, బెయిల్ పేపర్లు ఆన్ లైన్ లో అప్ లోడ్ కావడంలో జాప్యం వంటి పలు సాంకేతిక కారణాలతో అల్లు అర్జున్ ను నిన్న రాత్రి విడుదల చేయలేదు.
దీంతో, రాత్రి మంజీరా బ్లాక్ లో అల్లు అర్జున్ ఉన్నారు. సాధారణ ఖైదీలాగా నేలపైనే అల్లు అర్జున్ నిద్రపోయారని తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 6.30 ప్రాంతంలో విడుదలైన అల్లు అర్జున్ జైలు వెనుక గేటు నుంచి ఇంటికి వెళ్లారు. మరోవైపు, జైలు అధికారుల తీరుపై అల్లు అర్జున్ లాయర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జైలు దగ్గరకు అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర రెడ్డి, లాయర్లు, అభిమానులు వచ్చారు.