టాలీవుడ్ స్టార్ హీరో, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. తీవ్ర ఉత్కంఠ నడుమ వాడీవేడీగా జరిగిన వాదనల పిదప అల్లు అర్జున్ కు న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పరిమిత సమయానికి అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చామని, ఈ సమయంలో ఇరు వర్గాలు ఈ కేసుకు సంబంధించి మరింత సన్నద్ధం కావాలని సూచించారు.
అంతకుముందు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. దీంతో, జైలు దగ్గరకు వందలాది మంది అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారు. దీంతో, అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ లోపే అల్లు అర్జున్ కు బెయిల్ రావడంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీస్ స్టేషన్, కోర్టులో ప్రొసీజర్ పూర్తయిన తర్వాత కాసేపట్లో అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లే అవకాశముంది.
కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవన్న అల్లు అర్జున్ తరఫు లాయర్ల వాదనలతో కోర్టు ఏకీభవించింది. అల్లు అర్జున్ నటుడు మాత్రమే కాదు సామాన్య పౌరుడు కూడా..కాబట్టి ఆయనకు వర్తించే మినహాయింపులు నిరాకరించలేమని కోర్టు అభిప్రాయపడింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని, నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను ఆపాదించాలా..? అని ప్రశ్నించింది. అదే సమయంలో రేవతి కుటుంబంపై సానుభూతి ఉందని, అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని హైకోర్టు అభిప్రాయపడింది.