చిత్తూరు లో అదో చిన్న గ్రామం. ఆ గ్రామంలో దివ్యాంగుడైన ఒక వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు విచారణ చేపడితే ఏ క్లూ దొరకలేదు. పల్లెటూరిలో ఇలా ఓ వృద్ధుడిని ఎవరు, ఎందుకు హత్య చేశారో అంతుబట్టలేదు. కుటుంబ సభ్యులకు కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ కొన్ని రోజులు గడిచాయి. కువైట్ నుంచి ఓ వ్యక్తి తనే ఈ హత్య చేశానంటూ.. అందుకు కారణాన్ని వివరించి అందరినీ షాక్‌కు గురి చేశాడు.
హత్య చేసిన వేరే దేశానికి వెళ్లినవాడు గుట్టు చప్పుడు కాకుండా ఉండిపోకుండా తనే హత్య చేశానంటూ.. ఆ హత్యకు దారి తీసిన కారణం వివరించడం అందరినీ విస్మయానికి గురి చేసింది. సినిమా స్టోరీని తలపించేలా సాగిన ఈ హత్యోదంతం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో ఓబులవారి పాలెం మండలం కొత్త మంగంపేటలో జరిగింది.
ఇటీవలే 59 ఏళ్ల గుట్ట ఆంజనేయులు అనే దివ్యాంగుడు హత్యకు గురయ్యాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఐతే కొన్ని రోజుల తర్వాత తనే ఈ హత్య చేశానంటూ కువైట్‌లో ఉంటున్న ఆంజనేయ ప్రసాద్ సంచలన వీడియో రిలీజ్ చేశాడు. ఆంజనేయులు, అతడి భార్య చంద్రకళ బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లారు. దీంతో తమ కూతురిని చెల్లెలు లక్ష్మి, ఆమె భర్త వెంకటరమణ దగ్గర వదిలిపెట్టారు.
వీళ్లే కొన్నేళ్లుగా ఆ అమ్మాయిని చూసుకుంటున్నారు. ఐతే వెంకటరమణ తండ్రి ఆంజనేయులు.. ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. చంద్రకళ.. లక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడితే సరిగా స్పందించలేదు. దీంతో ఆమె కువైట్ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆంజనేయులును పిలిచి మందలించి వదిలేశారు. ఐతే విషయం తెలుసుకున్న ఆంజనేయ ప్రసాద్ ఈ అన్యాయాన్ని తట్టుకోలేకపోయాడు.
ఎవరికీ తెలియకుండా కువైట్ నుంచి వచ్చి నిద్రపోతున్న ఆంజనేయులు తల మీద ఇనుప రాడ్డుతో బాది చంపేశాడు. సైలెంట్‌గా కువైట్‌కు వెళ్లిపోయాడు. తర్వాత తనే స్వయంగా ఈ హత్య చేశానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఒక ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమే అని.. త్వరలోనే పోలీసులకు లొంగిపోతానని ప్రకటించాడు. అతడికి సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ లభిస్తోంది.