అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రపంచ కుబేరుడు అన్న టైటిల్ మస్క్ కు కొత్తేం కానప్పటికి.. తాజాగా ఆయన బ్రేక్ రికార్డు ప్రత్యేకత ఏమిటంటే.. ఈ మార్క్ ను దాటేసిన వ్యక్తిగా.. ప్రపంచంలోనే ప్రధముడిగా ఆయన నిలిచారు. ఇంతకూ ఆయన సాధించిన తాజా రికార్డు ఏమంటే.. 400 బిలియన్ డాలర్ల మార్క్. మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల 34 లక్షల కోట్ల రూపాయిలు (కచ్చితంగా చెప్పాలంటే రూ.3,39,29,84,83,60,000.00)
ఈ అంకెను విన్నంతనే కొంచెం కన్ఫ్యూజ్ కు గురి కావొచ్చు. కానీ.. లెక్క వేస్తే అర్థమవుతుంది.. అదెంత పెద్ద మొత్తమో. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద 447 బిలియన్ డాలర్లు. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆయన సంపద గణనీయంగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ నకు ఓపెన్ గా సపోర్టు చేయటమే కాదు.. ఆయన గెలుపునకు సర్వశక్తులు ఒడ్డారు.
స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ కంపెనీ స్పేస్ ఎక్స్ అంతర్గత వాటా విక్రయంతో మస్క్ సంపాదన సుమారు 50 బిలియన్ డాలర్లు పెరిగినట్లుగా లెక్క కట్టింది. అంతేకాదు.. టెస్లా షేర్లు తాజాగా ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోవటం గమనార్హం. దీంతో.. మస్క్ ఆర్థిక స్థితి మరింత పెంపునకు దోహదపడింది. మస్క్ తర్వాత స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ నిలిచారు. ఆయన సంపద 249 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. దీంతో మొదటి స్థానంలో ఉన్న ఇలాన్ మస్క్ కు బెఫ్ బెజోస్ కు మధ్య వ్యత్యాసం 151 బిలియన్ డాలర్లు. మూడోస్థానంలో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ (224 బిలియన్ డాలర్లు), లారీ ఎల్లిసన్ (198 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్ (181 బిలియన్ డాలర్లు)లు నిలిచారు.
ప్రస్తుతం 400 బిలియన్ డాలర్ల మార్క్ ను దాటేసిన ఇలాన్ మస్క్ సంపద రెండేళ్ల క్రితం వరకు కూడా 200 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉండేది. ఆయన సంపద పెరగటానికి టెస్లా.. స్పేస్ ఎక్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ ఏఐ కూడా నిలిచినట్లుగా చెప్పాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా మాంచి జోరు మీద ఉన్న ఇలాన్ మస్క్.. ట్రంప్ గెలుపుతో ఆయన కంపెనీల షేర్లు మాంచి జోరు మీద ఉన్నాయని చెప్పక తప్పదు.