సంధ్య ధియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే, అల్లు అర్జున్ కు బెయిల్ వస్తుందా లేక జైలుకు వెళ్లాల్సి వస్తుందా అన్న ఉత్కంఠ సర్వత్రా ఏర్పడింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. అల్లు అర్జున్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
అల్లు అర్జున్ థియేటర్ కు రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని కోర్టుకు పోలీసులు తెలిపారు. అందుకే, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని అన్నారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి అల్లు అర్జున్ కు 2 వారాలపాటు రిమాండ్ విధించారు. దీంతో, అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్ వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ సంఖ్యలో నాంపల్లి కోర్టు, చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.