మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయని కొంతకాలం క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్ ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు కాలుదువ్వారని ఒక వీడియో వైరల్ కూడా అయింది. అయితే, ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, అనూహ్యంగా తాజాగా మంచు మోహన్ బాబు, మనోజ్ ల మధ్య గొడవ జరిగిందని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. గాయాలతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మనోజ్…తన తండ్రి మోహన్ బాబుపై ఫిర్యాదు చేశారని పలు మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయి.
తనతో పాటు తన భార్యపైనా ఆయన దాడి చేశారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నట్లు ప్రచారం జరగింది. మరోవైపు, తనపై మనోజ్ దాడి చేశాడంటూ మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని కథనాలు ప్రసారమయ్యాయి. ఆస్తి వ్యవహారాల నేపథ్యంలో తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఈ వార్తలను మంచు మోహన్ బాబు కుటుంబం ఖండించింది. అసత్య కథనాలను ప్రసారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఎటువంటి ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు హితవు పలికింది.