తెలుగు సినీ పరిశ్రమలో అనతి కాలంలోనే భారీ స్టార్డమ్ అందుకున్న హీరోయిన్లలో శ్రీలీల ఒకటి. ఆకట్టుకునే అందం, నటన ప్రతిభ, అంతకుమించిన డాన్సింగ్ టాలెంట్ తో శ్రీలీల బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది. అటు యంగ్ హీరోలకు, ఇటు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ గా మారింది. అయితే ఇటీవల వరుస పరాజయాలు పలకరించడంతో శ్రీలీల రేసులో వెనుకబడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే ఆమె పుష్ప 2 చిత్రంలో `కిస్సిక్` అనే ఐటమ్ సాంగ్ చేసింది. అందుకుగానూ రూ. 1.5 కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపేస్తున్న ఈ సాంగ్ శ్రీ లీలకు బాగానే కలిసొచ్చింది. పుష్ప 2 విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడం, కిస్సిక్ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంతో శ్రీలీల గ్రాఫ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగింది. తమిళంలో స్టార్ హీరో శివ కార్తికేయన్ కు జోడిగా నటించే అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్ సినిమాల్లో నటించమంటూ కాల్స్ వస్తున్నాయి. కానీ, టాలీవుడ్ లో మాత్రం హీరోయిన్ గా కన్నా ఐటెం సాంగ్ ఆఫర్సే ఎక్కువగా తలుపుతడుతున్నాయట. పైగా మొన్నటి వరకు శ్రీలీలను క్యూట్ హీరోయిన్ అన్నవారే ఇప్పుడు ఐటమ్ గర్ల్ అని సంభోదిస్తున్నారట.
ఆ పేరు నచ్చలేదో, మరేమో గాని.. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇకపై ఐటెం సాంగ్స్ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఐటెం సాంగ్ ఆఫర్లు ఎన్ని వస్తున్నా.. ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా నో అని చెప్పేస్తుందట. ఇటీవల చిరంజీవి `విశ్వంభర` లో కూడా ఓ ఐటెం సాంగ్ కు నిర్మాతలు శ్రీలీలను సంప్రదించారట. అయితే వారికి సైతం చేయనని ఖరాకండీగా చెప్పేసింది శ్రీలీల. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, రవితేజ వంటి హీరోలతో సినిమాలు చేస్తోంది. త్వరలోనే రాబిన్హుడ్ అనే చిత్రంలో ప్రేక్షకులను పలకరించనుంది.