వైసీపీ నేతలపై , ఆ పార్టీ అధినేత జగన్ పై గత ఐదేళ్లుగా రఘురామ కృష్ణరాజు అలుపెరగని పోరాటం చేసిన సంగతి తెలిసిందే. జగన్ నియంత పాలనను ఎత్తిచూపుతూ రఘురామ చేసిన రచ్చబండ కార్యక్రమం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే రఘురామను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు పెట్టి కస్టడీలో టార్చర్ కి కూడా గురి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎంపికైన రఘురామకు మరో గౌరవాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది.
రఘురామకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ చట్టం ఆర్టికల్ 15 ప్రకారం చంద్రబాబుకు కేబినెట్ హోదా కల్పించారు. రఘురామ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నంతకాలం ఆయనకు కేబినెట్ హోదా వర్తించనుంది. అయితే వ్యక్తిగతంగా ఆయనకు కేబినెట్ హోదా వర్తిస్తుందని ప్రభుత్వ రాజకీయ కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
రఘురామకు కేబినెట్ ర్యాంక్ ప్రకారం ప్రోటోకాల్, భద్రత ఉంటాయని చెప్పారు. ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా ఏ డిప్యూటీ స్పీకర్ కు కేబినెట్ హోదా కల్పించలేదు. ఈ హోదా దక్కిన తొలి డిప్యూటీ స్పీకర్ రఘురామ కావడం విశేషం.