ఐకాన్ స్టార్ అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా `పుష్ప 2` ఎట్టకేలకు ప్రేక్షకుల ముందు రాబోతోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో.. తెలంగాణ సర్కార్ టికెట్ ధరలు భారీగా పెంచుకునేందుకు మరియు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు, అర్ధరాత్రి 1.00 గంటకు బెనిఫిట్ షోలు పడబోతున్నాయి. అయితే ఈ షోల టికెట్ ధరలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పుష్ప 2 బెనిఫిట్ షోలకు అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్ మీద రూ. 800 పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ లెక్కన మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ఒక్కో బెనిఫిట్ షో టికెట్ రేటు రూ. 1200కు పైగా ఉంటుంది అనడంలో డౌటే లేదు. రిలీజ్ తర్వాత ప్రతి రోజు 5 ఆటలు వేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పుష్ప 2 మూవీకి ఏడు ఆటలు వేసుకునేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాగే డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ ధర పై రూ.150, మల్టీప్లెక్స్ లలో రూ.200 చొప్పున పెంచుకుని విక్రయించుకునేందుకు ప్రభుత్వం వేసులుబాటు కల్పిస్తోంది. డిసెంబర్ 9 నుంచి 16వ తేదీ వరకు సింగిల్ స్ట్రీన్ రూ.105, మల్టీప్లెక్స్ లలో రూ.150 చొప్పున టికెట్ ధరలు పెంచుకోవచ్చు. ఇక డిసెంబర్ 17 నుంచి 23వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో టికెట్ రేట్ మీద రూ. 20, మల్టీప్లెక్స్ లలో రూ. 50 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.