వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో బూడిద కోసం తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు, టీడీపీ నేత జేసీ ప్రభాకరరెడ్డి, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కయ్యానికి కాలు దువ్వడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరి మధ్య వివాదానికి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీసీ కేంద్ర బిందువు అయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్లాంట్ నుంచి నిత్యం దాదాపు ఐదు వందల టన్నుల బూడిద బయటకు వస్తుంది. సిమెంట్ తయారీ ముడి పదార్థాల్లో బూడిద కూడా ఒకటి కావడంతో.. దానికి మంచి డిమాండ్ ఏర్పడింది.
ఆర్టీపీసీ నుంచి వచ్చే బూడిదలో రెండు రకాలు ఉంటాయి. ట్యాంకర్ల లోకి డైరెక్ట్ గా లోడ్ చేసేది ఒకటి కాగా.. రెండోది చెరువులోకి వృధాగా పోయేది. ఇప్పుడు ఆ వేస్ట్ గా పోయే పాండ్ యాష్ కోసమే జేసీ, ఆది నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నారు. ఇది వరకు జేసీ వర్గీయులే చెరువులోకి పోయే బూడిదను సిమెంట్ ఫ్యాక్టరీలకు తలరించుకునేవారు. అయితే ఇప్పుడు రవాణాలో తమకు వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పట్టుబడుతున్నారు.
ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే క్రమంలోనే జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. గత నాలుగు రోజుల నుంచి ఇరు నాయకుల వర్గీయులు నానా రచ్చ చేయడంతో ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. బూడిదను లోడింగ్ చేయకుండా అడ్డుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూడిద రవాణాపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నవారు నాయకుల పంతాలకు తల పట్టుకుంటున్నారు.
ఇక ఈ ఇష్యూపై తాజాగా సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని నేతలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఆదినారాయణరెడ్డి, జేసి ప్రభాకరరెడ్డి తో పాటు జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జి భూపేష్ రెడ్డిలకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వివాదాన్ని పరిష్కరించేందుకు శుక్రవారం ముగ్గురు నేతలను చంద్రబాబు కలవబోతున్నారు. మరి నేడు బూడిద పంచాయితీకి బాబు గారు తెర దించుతారా? లేదా? అన్నది చూడాలి.