ఒకప్పుడు మెగా హీరోలంతా ఒకే గొడుగు కింద ఉండేవారు. ఆ కుటుంబంలోని కథానాయకులను మెగా హీరోలుగా గుర్తించేవారు. అభిమానులను అందరూ మెగా ఫ్యాన్స్ అనే పిలిచేవారు. కానీ కొన్నేళ్ల నుంచి కథ మారుతూ వస్తోంది. అల్లు అర్జున్ సొంత బ్రాండు కోసం గట్టిగా కృషి చేస్తున్నాడు. ‘మెగా’ అనే పేరెత్తడం లేదు. తన అభిమానులను ఆర్మీ అంటూ వేరే పిలుపుతో సంబోధిస్తున్నాడు.
తనకు లైఫ్ ఇచ్చిన చిరంజీవిని, తనను ఆదరించిన మెగా అభిమానులను అతను గుర్తుంచుకోవడం లేదని.. పవన్ కళ్యాణ్ అభిమానులను కావాలనే ఏదో రకంగా రెచ్చగొడుతున్నాడని మెగా అభిమానులు అతడికి యాంటీ అయిపోయారు. మరోవైపు మెగా ఫ్యాన్స్‌లో బన్నీ అభిమానులు వేరయిపోయారు. ఈ రెండు వర్గాల మధ్య ఇటీవల విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి. అవి ఇప్పుడు ఆఫ్ లైన్‌కు కూడా వెళ్లిపోతుండడం ఆందోళనకర పరిణామం.
ఇటీవల రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ టీజర్ లాంచ్ సందర్భంగా బన్నీని కించపరిచేలా కొన్ని ఫ్లెక్సీలు, ప్లకార్డులను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. దానికి ప్రతిగా బన్నీ ఫ్యాన్స్ కూడా అలాంటి పనే చేయడంతో సోషల్ మీడియాలో రెండు వర్గాలు గొడవ పడ్డాయి. ఐతే హీరోలు లేని చోట ఊరూ పేరు లేని వాళ్లు అభిమానుల పేరుతో ఏదో చేస్తే ఎవరిని బాధ్యులను చేయాలన్నది ప్రశ్నార్థకం. ఐతే తాజాగా బన్నీ చెన్నైలో ‘పుష్ప-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనగా అందులో పవన్ కళ్యాణ్, మిగతా మెగా హీరోలను కించపరిచేలా పెద్ద సంఖ్యలో ప్లకార్డులను ప్రదర్శించారు.
ఇవి అభిమాన సంఘాలు ఆర్గనైజ్డ్గా చేశాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక బన్నీ పీఆర్ టీం ఉందని.. ఇదంతా కావాలనే చేశారని మెగా ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఒక ప్లకార్డు అయితే ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రముఖంగా కనిపించడం.. బన్నీ షేర్ చేసిన ఒక ఫొటోలు కూడా బ్లర్ అయిన ఆ ప్లకార్డు కనిపించడం.. స్టేజ్ మీద విజువల్స్‌లో కూడా అది హైలైట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ మంటెత్తిపోతున్నారు. ఇప్పటికే రెండు వర్గాల మధ్య ఉన్న గొడవకు ఈ ఉదంతం మరింత ఆజ్యం పోసినట్లు అయింది. దీనికి ప్రతిగా మెగా ఫ్యాన్స్ ఏం చేస్తారో అనే చర్చ జరుగుతోంది.