ఏళ్లుగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబరు 5న థియేటర్లలో సందడి చేయటానికి ముందు.. వివిధ వేదికల మీద ఈ సినిమాకు సంబంధించిన వేర్వేరు వేడుకల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో వచ్చే ప్రత్యేక గీతాన్ని చెన్నై వేదికగా నిర్వహించిన వేడుకలో రిలీజ్ చేశారు. కిస్సిక్ పేరుతొ రిలీజ్ అయిన ఈ సాంగ్ విన్నంతనే ఆకట్టుకునేలా ఉండటమే కాదు.. రానున్న రోజుల్లో ఈ సాంగ్ రికార్డుల దుమ్ము దులిపేలా ఉందని చెప్పక తప్పదు.
చెన్నై వేదిక మీద తమిళ్ లో మాట్లాడిన అల్లు అర్జున్.. తన ప్రసంగం మొత్తం ఎమోషనల్ గా సాగింది. తన ప్రసంగంలో భాగంగా ఆయన కొన్ని ఆసక్తికర.. కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ ఉన్నప్పటికి.. మైత్రీ మూవీస్ లేకుంటే ఈ మూవీ లేదన్న అల్లు అర్జున్.. చెన్నైతో తనకున్న అనుబంధాన్ని ప్రత్యేకంగా పలుమార్లు ప్రస్తావించటం గమనార్హం. అంతేకాదు పుష్ప సిగ్నేచర్ డైలాగ్ అయిన పుష్ప అంటే ఫ్లవర్.. ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్ అంటూ తనదైన శైలిలో చెప్పి అందరిని అలరించారు.
తన ప్రసంగం మొత్తాన్ని పూర్తిగా తమిళ్ లో మాట్లాడిన అల్లు అర్జున్.. చెన్నైతో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావిస్తూ.. ‘చెన్నై వస్తే ఆ ఫీలే వేరు. నాకు ఈ నేలతో ఉన్న అనుబంధమే వేరు. మీ జీవితంలో తొలి ఇరవై ఏళ్లు ఎలా గడిపారో.. మిగతా జీవితం అలా ఉంటుంది. నా జీవితంలో మొదటి 20 ఏళ్లు చెన్నైలోనే గడిచాయి. నేనేం సాధించినా.. అదంతా చెన్నైకే అంకితం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు లేకపోతే ఈ సినిమా అసాధ్యం. మాకు సొంత నిర్మాణ సంస్థ ఉన్నా చెబుతున్నా. పుష్పని మైత్రీ మూవీ మేకర్స్ చేసినట్టు ఏ సంస్థా చేయలేదు’’ అంటూ నిర్మాతల్ని పేరు పేరునా ప్రస్తావించి.. వారికి థ్యాంక్స్ చెప్పారు. తన జీవితంలో నాలుగేళ్లు ఈ సినిమా కోసం పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ గురించి ప్రస్తావించిన బన్నీ.. ‘‘నా ఇరవై సినిమాల్లో పది సినిమాల కంటే ఎక్కువే అతడు సంగీతాన్ని అందించాడు. నా సినిమాలకు అతను ప్రేమతో మ్యూజిక్ ఇస్తాడు. మిగిలిన వారికి చేసినట్లే చేస్తూ.. అదనంగా తన ప్రేమను నా సినిమాలకు పంచుతాడు. దేవీశ్రీ ప్రసాద్ లేకుండా నా జర్నీ సాధ్యమయ్యేది కాదు. అందుకు తనకు ధన్యవాదాలు’’ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.
పుష్ప మూవీలో హీరోయిన్ రష్మిక గురించి చెప్పే క్రమంలో ఆమెను ‘క్రష్మిక’ అంటూ తన ప్రేమను వ్యక్తం చేవారు. నాలుగేళ్లు ఈ సినిమాకు రష్మిక పని చేసిందని.. ఆమెను ఇన్నాళ్లుగా చూస్తూనే ఉన్నానని.. తాను ఇచ్చిన కంఫర్టు కారణంగానే తానింత బాగా పెర్ఫామెన్స్ చేసినట్లుగా చెప్పారు. యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందని.. ఈ సినిమాలో రష్మికతో చేయటంతో మరింత బాగా చేసే వీలు కలిగిందన్నారు.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల అంటూ ఆమె గురించి చెప్పిన బన్నీ.. ‘‘నా కెరీర్ లో తొలిసారి ఒక పాటకు డాన్స్ చేసేటప్పుడు ముందుగా జాగ్రత్తపడ్డాను. అందుకు కారణం డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల. తను చాలా హార్డ్ వర్కింగ్. అంతేకాదు సూపర్ క్యూట్ గర్ల్. తను ఈ పాటలో చేసిన డాన్స్ గురించి చెప్పటం లేదు మీరు చూడాలంతే. అందరికి నచ్చేస్తుంది’’ అని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు సుకుమార్ గురించి చెబుతూ.. తను లేకపోతే ఆర్య లేదని.. ఆ సినిమా వల్లే తాను ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లుగా చెప్పారు. తన తొలి సినిమా హిట్ మూవీగా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఇచ్చారని.. ఆ తర్వాత తాను ఏడాది పాటు ఖాళీగా ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కథలు వింటూ ఉండేవాడిని. నాతో సినిమా చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సుకుమార్ వచ్చి సినిమా చేశారు. తర్వాత నుంచి వెనుదిరిగి చూసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఇంతగా నా లైఫ్ మారటానికి కారణమైన వ్యక్తి ఎవరా అంటే నేను సుకుమార్ పేరునే చెబుతా. ఆయనెంతో సిన్సియర్ డైరెక్టర్. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నా.. ఆయన స్టేజ్ మీదకు రాకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. ఇదే.. ఆయన ఏమిటో చెప్పటానికి’’ అంటూ సుకుమార్ గురించి చెప్పుకొచ్చారు.
తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన అల్లు అర్జున్.. తన ఫ్యాన్సే తన ఆర్మీగా పేర్కొన్నారు. వాళ్ల ప్రేమ తనపై తగ్గకుండా డిసెంబరు 5న అందరి హ్రదయాల్లో వైల్డ్ ఫైర్ తీసుుకొస్తానన్న బన్నీ.. తనపై ప్రేమను చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా తన ఇరవై నిమిషాల ప్రసంగంలో అందరి మనసుల్ని దోచుకోవటమే కాదు.. తాను మాట్లాడేది ఏదైనా సరే.. నోటితో కాదు మనసుతో అన్న భావన కలిగేలా చేశారని చెప్పాలి.